ప్రాణం పోసిన ఎక్మో..

Covid Patient Survived With ECMO therapy - Sakshi

కోవిడ్‌తో ‘యశోద’లో చేరిన కోరుట్ల మహిళ

వైరస్‌ తీవ్రతతో పనిచేయని గుండె, ఊపిరితిత్తులు

ఎక్మో చికిత్సతో పది రోజుల్లో సాధారణ స్థితికి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ బారిన పడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళకు ఎక్మో చికిత్స విధానంతో పునర్జన్మనిచ్చారు యశోద ఆస్పత్రి వైద్యులు.. ప్రస్తుతం బాధితురాలు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన భారతి (58) కోవిడ్‌ బారిన పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను చికిత్స కోసం బంధువులు సెప్టెంబర్‌ 16న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమెకు శ్వాస సమస్యలు ఎదురవ్వడంతో వైద్యులు ఐసీయూకి తరలించారు. 17న ఆమెకు వెంటిలేటర్‌ అమర్చారు. శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ 80 నుంచి 90లోపు నమోదైంది. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించింది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు కూడా స్తంభించింది. చదవండి: ఆగే గుండెకు ఆయువు పోస్తుంది..

మృత్యువుతో పోరాడుతున్న ఆమెను బతికించాలంటే ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ మెంబ్రైన్‌ ఆక్సిజనేషన్‌) చికిత్స విధానం ఒక్కటే పరిష్కారమని భావించారు. బంధువులూ ఎక్మోకు అంగీకరించడంతో 19న ఆ చికిత్స ప్రారంభించారు. ఇదే సమయంలో బ్రాంకోస్కోపి నిర్వహించి, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగించారు. తద్వారా స్తంభించిపోయిన గుండె, ఊపిరితిత్తుల పనితీరు క్రమంగా మెరుగుపడింది. సరిగ్గా పది రోజులకు ఎక్మోను తొలగించారు. ప్రస్తుతం ఆమె కోవిడ్‌ నుంచి బయట పడటమే కాకుండా అవయవాల పనితీరు కూడా మెరుగుపడినట్లు వైద్యులు ప్రకటించారు. అక్టోబర్‌ 5వ తేదీన ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి, రీహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఆమెను ఇంటికి పంపినట్లు ఆస్పత్రి పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల తెలిపారు. చదవండి: ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టుపై దాడి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top