ఈఎస్‌ఐలో కోవిడ్‌ చికిత్స  | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐలో కోవిడ్‌ చికిత్స 

Published Tue, Jan 18 2022 4:23 AM

Covid 19 Treatment In ESI Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 వ్యాప్తి తీవ్ర మవుతున్న సమయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) అప్రమత్తమైంది. వైరస్‌ బారిన పడుతున్న ఈఎస్‌ఐ చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలందించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో కోవిడ్‌–19 చికిత్స కోసం ప్రత్యేక విభాగాలను తెరవాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్పత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో కోవిడ్‌–19 ఇన్‌ పేషంట్‌ (ఐపీ) సేవలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కార్పొరేషన్‌ స్పష్టం చేసింది.

ఈ మేరకు ఈఎస్‌ఐ ప్రాంతీయ సంచాలకులు (ఆర్డీ), డైరెక్టర్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (డీఐఎంఎస్‌), ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాలల డీన్‌లకు తాజాగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిని కోవిడ్‌–19 ప్రత్యేక ఆస్పత్రిగా మార్చారు. ఇక్కడ సాధారణ సర్వీసులు కొనసాగిస్తూనే, కరోనా బాధితులకు చికిత్స అందిస్తారు.

ఇందుకోసం 50 సాధారణ, 54 వెంటిలేటర్, ఆక్సిజన్‌తో కూడిన బెడ్లు, 21 వెంటిలేటర్, ఆక్సిజన్‌తో కూడిన ఐసీయూ బెడ్లు కేటాయించారు. ఇప్పటికే చికిత్సలు ప్రారంభించా రు. మరోవైపు నాచారం ఈఎస్‌ఐతో పాటు జీడిమెట్లలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రిలోనూ కోవిడ్‌ చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఈఎస్‌ఐ చందాదారులకు, ఈఎస్‌ఐ కార్డుదారులకే సేవలందిస్తారు.  

డిస్పెన్సరీల్లో కోవిడ్‌–19 కిట్లు! 
రాష్ట్రంలో 21 లక్షల మంది ఈఎస్‌ఐ చందాదారులున్నారు. వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షల మంది లబ్ధిదారులున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 110 ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ద్వారా చందాదారులకు ఉచిత వైద్య సేవలందుతున్నాయి. ప్రస్తుతం ఈ డిస్పెన్సరీల్లో జనరల్‌ చెకప్‌ సేవలు, అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు.

తాజాగా కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు కోవిడ్‌–19 కిట్లు అందించే అంశాన్ని ఈఎస్‌ఐసీ పరిశీలిస్తోంది. పాజిటివ్‌ వచ్చి లక్షణాలున్న బాధితులకు సమీప డిస్పెన్సరీల్లోని వైద్యుల సలహా తీసుకుని మాత్రలు వేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అదేవిధంగా సాధారణ లక్షణాలతో ఉన్న వారికి కోవిడ్‌–19 కిట్‌ను అందించే ఏర్పాట్లు చేయాలని డీఐఎంఎస్‌లకు ఈఎస్‌ఐసీ ఆదేశించింది.   

Advertisement
Advertisement