జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం
వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
సమస్యలను సీసీఐ దృష్టికి తీసుకెళ్లాలంటూ ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) విధించిన నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఈనెల 17వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తామని అల్టిమేటం ఇచ్చాయి. ఎకరాకు ఏడు క్వింటాళ్లు, ఎల్–1, ఎల్–2 అంటూ కేటగిరీల వారీగా జిన్నింగ్ మిల్లులను విభజన చేయడానికి ఆదివారంలోగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. లేని పక్షంలో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తామని హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలోవ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మిల్లుల యాజమాన్యాలతో మాట్లాడాలని, ఈ అంశాన్ని సీసీఐ దృష్టికి తీసుకుని వెళ్లాలని వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఎల్–1, ఎల్–2 నిబంధనలతో రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. శుక్రవారం ఆయన వ్యవసాయ అధికారులతో జిన్నింగ్ మిల్లుల అల్టిమేటంపై సమీక్షించారు.
ఇప్పుడిప్పుడే ఎండ తీవ్రత పెరిగి, పత్తిలో తేమ శాతం తక్కువ ఉండే సమయంలో జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లను నిలిపేస్తామని చెప్పడం రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయని మంత్రి వ్యాఖ్యానించారు. పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని, అయినా జిన్నింగ్ మిల్లుల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్ర అధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులపై ఒత్తిడి తెచ్చేలా యత్నిస్తున్నట్టు తెలిపారు.
జిల్లాల వారీగా పత్తి దిగుబడిని లెక్కించాలి
క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి జిల్లాల వారీ సగటు పత్తి దిగుబడిని లెక్కించేలా కలెక్టర్లకు వెంటనే ఆదేశాలివ్వాలని వ్యవసాయశాఖ కార్యదర్శిని మంత్రి తుమ్మల ఆదేశించారు. గత సంవత్సరం దిగుబడిపై పది శాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని ఈ సంవత్సరం పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లుగా నిర్ణయించామని కేంద్ర జౌళిశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.
అయితే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పత్తి దిగుబడి ఎకరానికి 11 క్వింటాళ్ల వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్లు అంచనాల నేపథ్యంలో పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్ల నుంచి 11 క్వింటాళ్ల వరకు పొడిగించాలన్న మంత్రి విజ్ఞప్తి మేరకు, కేంద్ర జౌళిశాఖ జాయింట్ సెక్రటరీ తెలంగాణలో ఎకరానికి సరాసరి పత్తి దిగుబడి గణాంకాలని లెక్కించి పంపించాలని కోరారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు వాస్తవిక పత్తి దిగుబడి గణాంకాలు వెంటనే సేకరించి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.


