పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొర్రీలతో రైతులకు తప్పని ఇబ్బందులు
ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానంతోనూ ఎదురవుతున్న కష్టాలు
ఎకరాకు 13 నుంచి 7 క్వింటాళ్లకే కొనుగోళ్ల పరిమితితో రైతుల లబోదిబో
వెరసి ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆయా మిల్లుల్లో 724 మంది నుంచి 13,613 క్వింటాళ్ల పత్తి సేకరించాయి. కానీ ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ వ్యాపారులు ఇదే సమయంలో ఏకంగా 1,23,776 క్వింటాళ్ల మేర పత్తి కొనడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పత్తి పంటను తేమ శాతం ఆధారంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొర్రీలతో రైతులను ఇబ్బంది పెడుతోంది. పత్తి చేతికొచ్చే వేళ వర్షాలతో దిగుబడి తగ్గగా.. వచి్చన పత్తి సైతం రంగు మారింది. దీంతో ఇటు ప్రైవేట్, అటు సీసీఐ కేంద్రాలకు వెళ్లినా మద్దతు ధర లభించట్లేదు. తేమ శాతం 12 నుంచి మరింత పెంచాలన్న రైతుల డిమాండ్‌ను సీసీఐ పెడచెవిన పెట్టడం, కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి కావడం రైతులపాలిట శాపంగా మారింది. దీనికితోడు గతంలో ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ.. ప్రస్తుతం ఎకరాకు 7 క్వింటాళ్లకే కొనుగోళ్లను పరిమితం చేయడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి.
తేమ శాతం పేరుతో..
మొదటి తీత పత్తిని రైతులు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించగా తేమ శాతం, ఇతర సాకులతో తక్కువ ధరే చెల్లించారు. ఆపై క్వింటాకు రూ. 8,110 మద్దతు ధరతో సీసీఐ రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటివరకు 188 కేంద్రాలు ప్రారంభమవగా నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోంది. తేమ 8 శాతం నుంచి 12 శాతం లోపు ఉంటేనే కొంటామని సీసీఐ చెబుతోంది. ఈ కారణంగా కొందరికే అవకాశం లభిస్తుండగా రవాణా ఖర్చులు భరించి జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకెళ్లిన వారు అక్కడే ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. తుపాను ప్రభావం, చలికాలం వల్ల 15–20 శాతం తేమ ఉన్నా కొనాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
గుదిబండలా యాప్..
సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించాలనుకునే రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయమై విస్తృత ప్రచారం లేక నేరుగా వెళ్లి అవస్థలు పడుతున్నారు. అలాగే రైతు ఫోన్ నంబర్ మారినా, భూ భారతిలో వివరాలు లేకపోయినా తిరస్కరిస్తుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడలో గత నెల 22న కొనుగోళ్లు మొదలవగా ఇప్పటివరకు కేవలం 650 క్వింటాళ్లే సేకరించారు. తేమ 12 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో నిరాకరిస్తుండగా రైతులు తిరిగి తీసుకెళ్లలేక తల్లాడలోనే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా వ్యాపారులు క్వింటాకు రూ. రూ. 2 వేల వరకు తగ్గిస్తున్నారు.
తేమ ఉందని కొనుగోలు చేయలే..
ఐదెకరాల్లో పత్తి సాగు చేస్తే 20 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. తల్లాడ సీసీఐ కేంద్రంలో తేమ ఎక్కువగా ఉందని కొనలేమన్నారు. ప్రైవేటుగా విక్రయిస్తే క్వింటాకు రూ. వెయ్యి తగ్గించారు. ప్రభుత్వం 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలి. – బుర్రె రామారావు, అంజనాపురం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా
బస్తా పత్తికి చూడరట..
నాలుగెకరాల్లో కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తే 35 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. కానీ సీసీఐలో ఎకరాకు ఏడు చొప్పున 28 క్వింటాళ్లే కొంటామన్నారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు సీసీఐ కేంద్రానికి బస్తా పత్తి తీసుకొస్తే తేమ చూడకుండా మొత్తం తేవాలన్నారు. తీరా తెచ్చాక తేమ ఎక్కువుందని తిరస్కరిస్తే రవాణా ఖర్చు భారం పడుతుంది. – ఎస్.కే.చాంద్, వెంకటాపురం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా


