పక్కాగా రిపోర్టులు | Corona Test reports to be send to Mobile phone in Telangana | Sakshi
Sakshi News home page

పక్కాగా రిపోర్టులు

Aug 1 2020 3:44 AM | Updated on Aug 1 2020 8:20 AM

Corona Test reports to be send to Mobile phone in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మొబైల్‌ ఫోన్‌కే కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు పక్కాగా రానున్నాయి. పాజిటివ్‌ అయినా, నెగెటివ్‌ అయినా మొబైల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఫలితం పంపిస్తారు. దాంతోపాటు ఒక లింక్‌ను కూడా పంపిస్తారు. ఆ లింక్‌ను ఓపెన్‌ చేస్తే అందులో పూర్తి రిపోర్ట్‌ కనిపిస్తుంది. దాని ఆధారంగా పాజిటివ్‌ వచ్చిన కరోనా బాధితులు అవసరాన్ని బట్టి తక్షణమే ఆసుపత్రిలో చేరడం కానీ, ఐసోలేషన్‌కు వెళ్లడానికి కానీ వీలుకలుగుతుంది. నెగెటివ్‌ వచ్చినవారు ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే వాటికి చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌ ల్యాబ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’అనే పేరుతో యాప్‌ను శుక్రవారం ప్రారంభించింది. యాంటిజెన్‌ పరీక్ష చేయించుకుంటే అరగంట నుంచి గంటలోనే ఫలితాన్ని మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో పంపిస్తారు.

ఇక ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకుంటే 24 గంటల్లోగా ఎస్‌ఎంఎస్‌ వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటిదాకా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్న వారికి ఫలితం చెప్పడంలో సరైన పద్దతి లేదు. ఎవరికివారు తంటాలు పడి తెలుసుకోవాల్సిన పరిస్థితి. తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఒక్కోసారి ఫలితం తెలియక తీవ్రమైన లక్షణాలున్న బాధితులు సీరియస్‌ రోగులుగా మారుతున్నారు. పైపెచ్చు పరీక్ష ఫలితం లేకుంటే ఆసుపత్రులు చేర్చుకోవడం లేదు. అందుకే ఈ పద్దతికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో యాంటిజెన్, ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ఈ పద్ధతి ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. మొత్తం దాదాపు 1,100 సెంటర్లలో ఇదే పద్దతిలో ఎస్‌ఎంఎస్‌లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
 
రిజిస్ట్రేషన్‌... ఓటీపీ... ఆ తర్వాతే శాంపిళ్ల సేకరణ 
ప్రస్తుతం బాధితులు ఇచ్చే ఫోన్‌ నెంబర్‌ను, ఆధార్‌ నెంబర్, అడ్రస్‌ను ఆధారం చేసుకొని కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరైతే తప్పుడు ఫోన్‌ నెంబర్లు, అడ్రస్‌లు ఇస్తున్నారు. దీంతో వారికి సమాచారం ఇవ్వడానికి కూడా వీలుపడటం లేదు. పైగా వారెక్కడ ఉంటున్నారో కనుక్కోవడం, చుట్టుపక్కల అలర్ట్‌ చేయడం గగనంగా మారింది. దీంతో కరోనాను కట్టడి చేయడం పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్‌గా మారింది. కొందరు పాజిటివ్‌ ఉన్నవారు కూడా డాక్టర్ల సలహాలను పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి విస్త్రృతమవుతోంది.

ఈ పరిస్థితులన్నింటికీ చెక్‌ పెట్టేందుకే సర్కారు ఈ యాప్‌ను తయారు చేసిందని అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి పరీక్ష చేయించుకోవడానికి శాంపిల్‌ కేంద్రానికి వస్తే అతని పేరు, మొబైల్‌ నెంబర్, అడ్రస్‌లు సంబంధిత యాప్‌తో అనుసంధానమైన కంప్యూటర్‌లో ఎంటర్‌ చేస్తారు. ఈ వివరాలు ఎంటర్‌ చేశాక, అప్పటికప్పుడే సంబంధిత వ్యక్తి ఫోన్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీ చెబితేనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుంది. అప్పుడు మాత్రమే శాంపిల్స్‌ తీస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల వరకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేస్తుండగా (ప్రైవేటులో 1900, ప్రభుత్వంలో 3100), దాదాపు 14 వేల వరకు యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. ఇకనుంచి పరీక్షలు చేయించుకున్న వారందరికీ స్పష్టమైన రిపోర్ట్‌ ఫోన్‌ నెంబర్‌కే వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement