2026–27లో చేరొచ్చని ఐసీఈఏ అంచనా
మొబైల్ ఫోన్లకు తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) దన్నుతో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) ఆఖరు నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో ఎగుమతులు 30 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని భావిస్తోంది. ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ ఈ విషయాలు వెల్లడించారు.
2026 మార్చితో పీఎల్‌ఐ స్కీము ముగియనుండటం పరిశ్రమకు మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వివిధ ప్రోడక్టుల విభాగాలవ్యాప్తంగా భారత్ తయారీ సామర్థ్యాలను బట్టి తదుపరి దశ వృద్ధి ఆధారపడి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. మరోవైపు, భారత్ దాదాపు 30 కోట్ల యూనిట్ల మొబైల్ ఫోన్ల ఉత్పత్తి స్థాయికి చేరుతుందని మార్కెట్ రీసెర్చ్, అనాలిసిస్ సంస్థ కౌంటర్‌పాయింట్ సహ వ్యవస్థాపకుడు నీల్ షా తెలిపారు.
2025లో భారత్‌లో తయారైన ప్రతి నాలుగు ఫోన్లలో ఒకటి ఎగుమతయ్యిందని చెప్పారు. టెక్ దిగ్గజం యాపిల్ కారణంగా అమెరికా మార్కెట్ ప్రీమియం ఉత్పత్తులకు అతి పెద్ద ఎగుమతుల మార్కెట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. శాంసంగ్, మోటరోలా వల్ల కూడా గణనీయంగా విలువ చేసే ఎగుమతులు నమోదైనట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..


