సాధ్యపడని కట్టడి

Corona Cases Rapidly Increasing In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్రమవుతున్నాయి. గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 136 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కేసులసంఖ్య 6,000కు చేరుకున్నాయి. ఇందులో 2,300 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 3500 మంది కోలుకున్నారు. 74మంది మృతిచెందారు. ప్రభుత్వాసుపత్రిలో 82మంది చికిత్స పొందుతుండగా, శాతవాహన యూనివర్శిటీ ఐసోలేషన్‌లో 93మంది ఉన్నారు. ప్రతిమ ఆస్పత్రిలో 57, చల్మెడలో 73, వారాహిలో 26, సీవీఎంలో 31, మెడికవర్‌లో 5, శరణ్యలో 5, ఇతర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న వారు 65మంది ఉన్నారు. ప్రతి రోజు 500కు తక్కువ కాకుండా ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ రూపంలో శాంపిల్స్‌ తీసుకుని టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్‌లతో పోలిస్తే మరణాలు తక్కువగా ఉండడంతో పాటు వైరస్‌ బారిన పడినవారు త్వరగా కోలుకుంటుండడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. కరీంనగర్‌ పట్టణంతో పాటు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం, కంటైన్‌మెంట్‌లతో కరోనా బాధిత కుంటుంబాలు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నాయి. పాజిటివ్‌ వ్యక్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు.

అజాగ్రత్తతోనే విస్తరణ...
కరోనా వ్యాప్తికి అజాగ్రత్తలే కారణంగా కనిపిస్తున్నాయి. అనుమానితులుగా ఉన్నప్పుడే స్వీయ నిర్బంధం పాటించడం, కనీసం ఇంక్యూబేషన్‌ పీరియడ్‌ పూర్తయ్యే వరకూ అనుమానితులు ఎవరినీ కలవకుండా కనీస రక్షణ చర్యలు పాటించి ఉంటే వైరస్‌చైన్‌ను తెంచే అవకాశాలు ఉంటాయి. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పరిస్థితి లేకపోవడంతో వైద్యాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

హోం ఐసోలేషన్‌లతో ముప్పు
కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు చాలా మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు తమ పనులకు తామే బయటకు వెళ్తుండడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కొన్ని పాజిటివ్‌ కేసుల్లో లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో చాలా మంది తమకు కరోనా లేదనే భ్రమలోనే ఉంటున్నారు. కొందరు పరీక్షలు చేసుకున్న విషయం రహస్యంగా ఉంచి ఇతరులకు అంటగడుతున్నారు. 

సాధ్యపడని కట్టడి
తక్కువ కేసులు ఉన్నప్పుడు కట్టుదిట్టమైన చర్యలతో కరోనాకు అడ్డుకట్ట వేసినా... లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ జిల్లా యంత్రాంగానికి సవాలుగా మారుతున్నాయి. కాంటాక్టుల సంగతి దేవుడెరుగు కేసులను ట్రేస్‌చేయడం కూడా వైద్యాధికారులకు కత్తిమీద సాములా మారింది. మరణాలు తక్కువగా ఉండడంతో పాటు వైరస్‌ బారిన పడినవారు త్వరగా కోలుకుంటుండడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. కరీంనగర్‌ పట్టణంతో పాటు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం, కంటైన్‌మెంట్‌లతో కరోనా బాధిత కుంటుంబాలు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నాయి. పాజిటివ్‌ వ్యక్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top