వైరల్‌: మా ఇంటికి రాకండి..  మీ ఇంటికి రానివ్వకండి!

Corona Awareness Different Banners In Front Of House At Ramagundam - Sakshi

కరోనా నేపథ్యంలో ఇళ్ల ముందు ఫ్లెక్సీలు 

సాక్షి, కోల్‌సిటీ(రామగుండం): కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రజలు అప్రమత్తమయ్యారు. ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి..’ అంటూ ఇళ్లముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

రామగుండం నగరపాలక సంస్థ 31వ డివిజన్‌లోని ఎల్‌బీనగర్‌ వాసులు ‘కలిసికట్టుగా పోరాడుదాం.. కరోనా మహమ్మారిని ఖతం చేద్దాం.. మాస్క్‌ ధరిద్దాం, భౌతికదూరం పాటిద్దాం’అంటూ తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు ఆలోచింపజేస్తున్నాయి. 

గేటు దాటి రావొద్దు..
సాక్షి, జడ్చర్ల టౌన్‌: ‘నాతో పని ఉందా.. అయితే సెల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయండి. ఎన్నికల ప్రచారమా.. కరపత్రాలు పక్కన బ్యాగులో వేసి వెళ్లండి. ఇంట్లోకి మాత్రం రావద్దు..’అంటూ తాళం వేసిన ఇంటిగేటుకు బోర్డు పెట్టాడు ఓ వ్యక్తి. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న క్రాంతి ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

జడ్చర్లలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ మేరకు ఏర్పాటు చేశానని అతను చెప్పారు. 

కరోనాతో తండ్రీకొడుకుల మృతి
రాయికల్‌ (జగిత్యాల): జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కట్కాపూర్‌కు చెందిన తండ్రీకొడుకులు కరోనా బారిన పడి తొమ్మిది రోజుల వ్యవధిలో మృతిచెందారు. కొడుకు గంట రంజిత్‌ (30) ఈ నెల 9న మృతి చెందగా.. తండ్రి గంట మల్లారెడ్డి (63) ఆదివారం ప్రాణాలు వదిలారు.

కరోనాతో తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సామాజిక కార్యకర్తలు ఎనగందుల రమేశ్, కట్ల నర్సయ్య, సతీశ్‌ పీపీఈ కిట్లు ధరించి తండ్రీకొడుకుల అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి: రికార్డు స్థాయిలో కరోనా: కొత్తగా 2,73,810 పాజిటివ్‌ కేసులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top