ఫాస్ట్‌ఫుడ్‌.. హెల్త్‌బ్యాడ్‌! తెల్లగా మారితే.. ఆరెంజ్‌ కలర్‌ వేసి మరీ.. వామ్మో! వాళ్లకు మాత్రం కోట్లు.. మనకు..

Consuming Fast Food Will Lead Health Problems Be Careful - Sakshi

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పద్నాలుగేళ్ల బాలుడు రాకేశ్‌ ఏడాదిగా అత్యధిక రోజులు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో తింటున్నాడు. పొట్టలో విపరీతమైన నొప్పి రావడంతో వైద్యుని వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు గ్యాస్ట్రిక్‌ సమస్య ఏర్పడిందని ఫాస్ట్‌ఫుడ్‌ మానేయాలని సూచించాడు. 

గంభీరావుపేటకు చెందిన ఓ రైతు పది హేను రోజుల క్రితం పని నిమిత్తం సిరిసిల్లకు వచ్చి మధ్యాహ్నం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో నోటికి రుచికరమైన పదార్థాలు ఆరగించాడు. సాయంత్రం ఇంటికెళ్లేసరికి వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఫుడ్‌ పాయిజన్‌ అయిందన్నారు. దీనికి కారణం వెతకగా..ఫాస్ట్‌ఫుడ్‌గా తేల్చారు.

సాక్షి, సిరిసిల్లటౌన్‌: జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌ వెర్రితలలు వేస్తోంది. నాణ్యత లేని పదార్థాలతో చేస్తున్న వంటలు ప్రజలను ఆస్పత్రుల పాలుచేస్తుంది. జంక్‌ఫుడ్‌గా పిలిచే ఫాస్ట్‌ఫుడ్‌ అలవాటుగా చేసుకుంటే ప్రాణాల మీదికొచ్చే అవకాశం ఉన్నా జనాలు పట్టించుకోవడం లేదు. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతున్నా నియంత్రించాల్సిన అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న నాసిరకం, నిబంధనలు పాటించకుండా తయారు చేసే ఫాస్ట్‌ఫుడ్‌పై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం..

రూ.కోట్లలో వ్యాపారం
ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‌ ఒకప్పుడు నగరాల్లోనే ఉండేది. ఇప్పుడది ప్రతీ పల్లెకు విస్తరించింది. చిన్నపాటి గ్రామంలో సైతం ఫాస్ట్‌ఫుడ్‌ను జనాలు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని పాడుచేసేదే అయినా అధిక లాభాలు వస్తుండడంతో వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, ప్రధాన పల్లెలు, హైవేపై ఉండే గ్రామాల్లో సైతం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నిర్వర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 పైగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకు తక్కువలో తక్కువగా రూ.10లక్షల వరకు దందా సాగుతోంది. నెలకు రూ.3కోట్లలో ఫాస్ట్‌ఫుడ్‌ దందా జరుగుతుంది. 

నిబంధనలు బేఖాతర్‌
ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నూనెలు వినియోగించాల్సి ఉండగా.. ఎక్కువ ఫాస్ట్‌సెంటర్లలో నాసిరకం వాడుతున్నట్లు సమాచారం. నాణ్యమైనవి, బ్రాండెడ్‌ వాడాలంటే.. ఖరీదు కాబట్టి.. తక్కువ రేటుకు దొరికే పదార్థాలు, నూనెలు వాడుతున్నారు.

రుచి కోసం ఆహారంలో నిశేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నాణ్యమైనవి వాడుతున్నామని ఫాస్ట్‌సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నా..ఏళ్ల తరబడిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టే అధికారం ఉన్న శాఖలు ‘మామూలు’గా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 

ఇవీ ప్రభావాలు..

  • చికెన్‌ ఫ్రైడ్‌రైస్‌ చేసేటప్పుడు తెల్లగా మారిన చికెన్‌ను ఆరెంజ్‌ రంగు వేసి కనిపించకుండా చేస్తారు. ఈ కలర్‌ ప్రభావం ఒకసారి మన చేతికి అంటితే వారం రోజుల వరకు రంగు పోదు. 
  • సోయాసాస్‌ రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు లేదా కొన్ని రోజులుగా కాగిన నూనెను వాడుతున్నట్లు సమాచారం. 
  • ఖరీదు తక్కువ..ఆరోగ్యాన్ని దెబ్బతీసే పామాయిల్‌ వాడుతున్నట్లు తెలుస్తుంది. 
  • ఫ్రైస్‌ వంటి వంటకాలకు చేతికి దొరికిన     పిండిని కలిపేస్తున్నారు. దానిలో పురుగులు ఉంటున్నాయి. 
  • టమాట సాస్‌ ఎక్కువ మోతాదులో ఒకేసారి కొని పెడతారు. కొన్ని సందర్భాలలో పాడైన వాటిని పడేయకుండా వాడతారు. 
  • చిల్లీసాస్‌ వాసన చూస్తే వాంతులు రావడం ఖాయంగా ఉంటోంది. దీని వాడకంతో డబ్బులు బాగానే సంపాదిస్తారు. కానీ ఆరోగ్యంపై పట్టింపు ఉండకుండా దందా సాగిస్తారు.  

నిబంధనలు పాటించకుంటే కేసులు
ప్రజా ఆరోగ్యం దెబ్బతీసే పదార్థాలు వాడొద్దు. వంటశాలలు, హోటల్స్‌ పరిశుభ్రంగా ఉంచాలి. కస్టమర్లకు తాగునీరు ఇవ్వాలి.     మాంసాహారం, సూప్‌లు నిలువ ఉంచినవి వాడొద్దు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్, హోటల్స్‌ నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం. 
– వెల్దండి సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌  

(చదవండి: గోదావరిఖని.. ఇక పర్యాటక గని!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top