
రెండు లైన్లను అనుసంధానిస్తూ బైపాస్ లైన్ల నిర్మాణం
ఎటు నుంచి ఎటైనా నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు
భారీగా అనుసంధాన లైన్ల నిర్మాణం
ప్రస్తుతం చాలాచోట్ల ముందు స్టేషన్‌కు వెళ్లి ఇంజిన్ మార్చుకుని వెనక్కు రావాల్సిన పరిస్థితి
దీనిద్వారా ఒక్కో రైలుకు రెండు గంటల సమయం వృథా
సాక్షి, హైదరాబాద్: పర్లి–వికారాబాద్ రైలు మార్గం గుండా వచ్చే రైలు వాడీ మార్గంలోకి మళ్లాలంటే.. వికారాబాద్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ ఇంజిన్‌ను విడదీసి రివర్స్ చేసి రైలుకు మరోవైపు జత చేస్తే కాని రాలేని దుస్థితి. ఈ తంతు పూర్తి కావాలంటే గంటన్నర నుంచి రెండు గంటలు పడుతుంది. అప్పటివరకు రైలు అక్కడ నిలిచి ఉండాల్సిందే. అదే సమయానికి వేరే రైళ్లు ప్రయాణిస్తుంటే ఈ వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్ లేకుంటే గంటన్నరలో పూర్తవుతుంది. అంటే ఆ రైలు గమ్యం చేరటానికి పట్టే ప్రయాణ సమయానికి ఇది అదనం అన్నమాట.
ఆదాకానున్న సమయం
రెండు రైల్వే లైన్లు అనుసంధానమవుతున్నప్పుడు వాటి నుంచి వచ్చిపోయే రైళ్లు పరస్పరం లైన్లు మారేందుకు వీలుగా అనుసంధాన లైన్లు ఉండాలి. కానీ, దశాబ్దాల క్రితం లైన్లు నిర్మించినప్పుడు ఈ అనుసంధానం ఒకవైపే ఏర్పాటు చేశారు. మరోవైపు వెళ్లాలంటే.. రైలు నేరుగా వచ్చి అక్కడి స్టేషన్‌లో ఆగి ఇంజిన్‌ను మరోవైపు మార్చుకుని వెనక్కు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత ఈ సమస్యను చక్కదిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించి, అన్ని అనుసంధానాల వద్ద ప్రత్యేకంగా బైపాస్ లైన్లను నిర్మించాలని నిర్ణయించింది. ఫలితంగా ప్రయాణ సమయంలో భారీ ఆదా కానుంది. కొన్ని రూట్లలో ఈ ఆదా గంట ఉంటే, కొన్ని రూట్లలో రెండు గంటలు ఉండనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం రూ.1.15 లక్షల కోట్లతో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణలో దాదాపు రూ.45 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. వాటిలో ఈ బైపాస్ లైన్లు కూడా ఉన్నాయి.
ప్రధాన బైపాస్ లైన్లు ఇవే..
నిజామాబాద్ బైపాస్: ప్రస్తుతం సికింద్రాబాద్–కరీంనగర్ మధ్య డైరెక్ట్ లైన్ లేదు. ఫలితంగా సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లాలన్నా, కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ రావాలన్నా.. రైళ్లు నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ ఇంజిన్లను రివర్స్ చేసుకుని ముందుకు సాగాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కో రైలుకు సగటున 71 నిమిషాల సమయం వృథా అవుతోందని అధికారులు గుర్తించారు. దీనికి విరుగుడుగా ఇప్పుడు కరీంనగర్–నిజామాబాద్ మార్గంలోని మామిడిపల్లి– సికింద్రాబాద్–నిజామాబాద్ మార్గంలోని డిచ్‌పల్లి మధ్య రెండు లైన్లను అనుసంధానిస్తూ రూ.121.97 కోట్ల వ్యయంతో 1.55 కి.మీ. నిడివితో బైపాస్ లైన్ ప్రతిపాదించారు.
బైపాస్ లైన్ల పరిస్థితి ఇదీ...
పెద్దపల్లి బైపాస్ లైన్: కాజీపేట నుంచి కరీంనగర్ వెళ్లాలంటే పెద్దపల్లి స్టేషన్‌కు వచ్చి ఇంజిన్ రివర్స్ చేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పెద్దపల్లి–కొత్తపల్లి మధ్య కరీంనగర్ లైన్‌తో బైపాస్ లైన్ ద్వారా అనుసంధానించారు. 2.17 కి.మీ. నిడివి ఉండే ఈ లైన్‌ను రూ.37 కోట్లతో నిర్మించారు. ఇటీవలే ఈ లైన్ అందుబాటులోకి వచి్చంది.
వికారాబాద్ బైపాస్ లైన్: సికింద్రాబాద్–వాడీ, వికారాబాద్–పర్లి మార్గాలను అనుసంధానిస్తూ బైపాస్ లైన్‌ను నిర్మిస్తున్నారు. పర్లి నుంచి వాడీ వైపు వెళ్లే రైళ్లు వికారాబాద్ స్టేషన్‌లో రివర్స్ చేసుకునే బాధ తప్పనుంది.
పెండ్యాల–హసన్‌పర్తి బైపాస్ లైన్: పెద్దపల్లి నుంచి హసన్‌పర్తి మీదుగా వచ్చే రైళ్లు సికింద్రాబాద్ వెళ్లాలంటే కాజీపేట్ స్టేషన్ మీదుగా రావాల్సి వస్తోంది. గ్రాండ్ ట్రంక్ రూట్ కావటంతో నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అన్నీ కాజీపేట జంక్షన్ మీదుగా రావాల్సి రావటంతో విపరీతమైన రద్దీ ఏర్పడి రైళ్లను స్టేషన్ బయటే కాసేపు నిలిపేయాల్సి వస్తోంది. దీనికి విరుగుడుగా హసన్‌పర్తి వద్ద బైపాస్ లైన్‌ను ప్రారంభించి ధర్మసాగర్–నస్కల్ మీదుగా నిర్మించి కాజీపేట–సికింద్రాబాద్ లైన్‌లో కలుపుతారు. దీనివల్ల.. పెద్దపల్లి కరీంనగర్ నుంచి వచ్చే రైళ్లు కాజీపేట స్టేషన్ వరకు వెళ్లకుండా హసన్‌పర్తి నుంచి బైపాస్ మీదుగా మళ్లి సికింద్రాబాద్ వైపు వస్తాయి.
విష్ణుపురం బైపాస్ లైన్: కాజీపేట–విజయవాడ లైన్‌లోని మోటమర్రి నుంచి గుంటూరు–సికింద్రాబాద్ లైన్లోని విష్ణుపురంను అనుసంధానిస్తూ గూడ్స్ లైన్ ఉంది. దీన్ని త్వరలో ప్రయాణికుల రైళ్ల కోసమూ వినియోగించాలని భావిస్తున్నారు. మోటమర్రి నుంచి జాప్‌పహాడ్ మీదుగా వచ్చే రైళ్లు సికింద్రాబాద్ వైపు రావాలంటే విష్ణుపురం స్టేషన్లో ఇంజిన్లను రివర్స్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ బాధ లేకుండా ఆ మార్గంలో వచ్చే రైళ్లు విష్ణుపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా సికింద్రాబాద్ లైన్‌తో బైపాస్ లైన్ ద్వారా అనుసంధానిస్తారు.