కోవర్టులపై వేటు వేద్దాం! 

Committee Meeting Was Chaired By PCC Chief Revanth Through Zoom app - Sakshi

అలాంటి వారిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకుందాం 

పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీనియర్ల సూచనలు 

సమష్టి నిర్ణయాలతోనే పార్టీ కార్యాచరణ: రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కోవర్టుల విషయంగా కఠినంగా వ్యవహరించాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. అలాంటి వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా వేటు వేయాలని తీర్మానించింది. శనివారం పీసీసీ చీఫ్‌ రేవంత్‌ అధ్యక్షతన జూమ్‌ యాప్‌ ద్వారా కమిటీ సమావేశం జరిగింది. ఇందులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్‌ కృష్ణన్, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, దళిత–గిరిజన దండోరా అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలో కోవర్టుల అంశాన్ని గోపిశెట్టి నిరంజన్‌ లేవనెత్తారు. కోవర్టులను గుర్తించి ఏరిపారేయాలని సూచించారు. దీనిపై మరికొందరు సభ్యులు కూడా స్పందించారని.. కోవర్టుల వ్యవహారం వల్ల క్షేత్రస్థాయిలోని పార్టీ కేడర్‌లో అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉందని, సన్నిహితులను కూడా నమ్మే పరిస్థితి ఉండదని పేర్కొన్నారని తెలిసింది.

ఈ క్రమంలోనే కోవర్టులను బహిష్కరించాలన్న డిమాండ్‌ వచ్చినట్టు సమాచారం. ఇక పార్టీ కార్యక్రమాలు, వ్యవహారాల విషయంలో నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోవాలని సమావేశంలో సభ్యులు సూచించారు. సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటివారిని మరింత దగ్గరికి తీసుకోవాలని కోరారు. దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. పీసీసీ కార్యక్రమాలన్నీ సమష్టి నిర్ణయంతోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. కాగా.. ఇంద్రవెల్లిలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడం పట్ల పీసీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ నెల 18న చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రావిర్యాలలో తలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top