
భారత్–పాక్ యుద్ధం జరుగుతున్న తరుణంలోనూ ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం
పర్యాటకంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టూరిజం కాంక్లేవ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడులతో ముందుకొచ్చిన సంస్థలతో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ‘భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించి చూపాం. తెలంగాణ ఎంత భద్రమైన ప్రాంతమో అది ప్రపంచానికి తెలియజెప్పింది. రాష్ట్రం ఏర్పడక ముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగిన ప్రభుత్వ విధానాన్ని మేం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలలోనే కాదు..తెలంగాణలో పర్యాటక రంగంలో కూడా భారీ పెట్టుబడులు రాబోతున్నాయి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఆయా సంస్థల ప్రతినిధులకు అవగాహన ఒప్పంద పత్రాలను అందజేశారు. ‘తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా పర్యాటక విధానం రూపొందలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ దేశాలు, దేశంలోని పలు రాష్ట్రాల పర్యాటక విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి మెరుగైన పర్యాటక విధానాన్ని రూపొందించాం. అది రూపొందిన ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి.
ఇప్పుడు రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాన్ని నిర్దేశించాను. దాన్ని కూడా సాధించే సత్తా తెలంగాణకు ఉంది. హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ కోటలాంటి చారిత్రక ప్రాంతాలున్నాయి. రాష్ట్రంలో కవ్వాల్, అమ్రాబాద్‌లాంటి పులుల అభయారణ్యాలున్నాయి. రామప్ప, వేయిస్తంభాల దేవాలయాల్లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలున్నాయి. వెరసి ఇప్పుడు తెలంగాణ ఓ గొప్ప పర్యాటక గమ్యం కాబోతోంది. పాత నగరం ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఖ్యాతిని మళ్లీ పునరుద్ధరించబోతున్నాం.’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
వారికెందుకో బాధగా ఉంది: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో పర్యాటక రంగం పురోగమిస్తుండటంతో కొందరికి ఎందుకో బాధగా ఉంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పేర్కొన్నారు. భాష, ప్రాంతం అన్న భేదం లేకుండా అందరినీ అక్కున చేర్చుకుంటున్న తెలంగాణ, ఇప్పుడు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో ముందుకు సాగబోతోందన్నారు. రెండు జీవనదుల మధ్య వెలిసిన ఈ దక్కన్ పీఠభూమి ఇప్పుడు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త యుగం ప్రారంభమైందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప ర్యాటక రంగం అంటే కేవలం దర్శనీయ స్థలాలకే పరిమితం కాదని, రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా, ఉపాధి కల్పనగా మార్చటాని కి దోహదం చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, డీజీపీ జితేందర్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి, నిథిమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ ప్రియాంక తదితరు లు హాజరయ్యారు.
అనంతరం 37సంస్థలతో పర్యాటక శాఖ పెట్టుబడికి సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి దోహదం చేసిన హోటళ్లు, రిసార్టులు, సోషల్ మీడియా, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీల్లో ఉత్తమ పురస్కారాలను అందజేశారు.