మద్దులపల్లిలో అభివృద్ధి పనుల పైలాన్‌లను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీలు రఘురాంరెడ్డి, మల్లు రవి తదితరులు
మీడియా యాజమాన్యాలకు గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి: సీఎం రేవంత్
సింగరేణి టెండర్లు సహా మా ప్రభుత్వంలో అవినీతికి తావులేదు
తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులకు ఒకటే విజ్ఞప్తి .. రాష్ట్రంలో టీడీపీ ఉండొద్దని కక్ష కట్టిన కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలి.. గ్రామాల్లో ఆ పార్టీ దిమ్మెలు కూలాలి
అయోధ్య తరహాలో భద్రాచలంలో రామాలయం నిర్మిస్తాం
ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక భేటీలో సీఎం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సింగరేణి బొగ్గు టెండర్లపై పత్రి కలు, టీవీల్లో వార్తలు వస్తున్నాయి. సింగరేణి టెండర్లు సహా మా ప్రభుత్వంలో ఏ పనిలోనూ నయాపైసా అవినీ తికి తావులేదు. ఇలాంటి వార్తలతో శుక్రాచార్యుడు, మారీ చులకు పరోక్షంగా సహకరించకండి. మీడియా యాజమా న్యాలకు గొడవలు ఉంటే మీరు, మీరు చూసుకోండి తప్ప మంత్రులను బద్నాం చేయకండి. ఏదైనా వార్త రాసేముందు ఒకసారి నన్ను అడగండి. ముఖ్యమంత్రిగా నేను 24 గంటలూ ప్రజలు, మీడియాకు అందుబాటులో ఉంటా. నా ఎమ్మెల్యేలు, మంత్రులపై వచ్చే ఏ చిన్న ఆరోపణ అయినా అది నా నాయకత్వానికి బద్నాం కలిగించినట్లే భావిస్తా.
మేమంతా సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపి స్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పైలాన్‌ను మద్దులపల్లి వద్ద ఆదివారం సీఎం ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలతో మద్దులపల్లి వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో శుక్రాచార్యుడు
‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్త యింది. మొదటి సంవత్సరం నుంచే శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు అడ్డుకోవడానికి బయలుదే రారు. శుక్రాచార్యుడు, మారీచుడు గురించి మీకు తెలుసు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే భగ్నం చేయాలని ప్రయత్నించారు. రాక్షసుల కులగురువు శుక్రాచార్యుడు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. ఇక మారీచుడు, సుబాహులు బావబామ్మర్దులు. మారీచుడు మాయా జింక రూపంలో సీతను ఎత్తుకెళ్లడానికి సహకరిస్తే రాముడి చేతిలో చావు తప్పలేదు. మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు.. (మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు)
2034 వరకు మాదే అధికారం..
‘రాష్ట్రంలో పదేళ్ల చొప్పున టీడీపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అధి కారంలో ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయి. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పున రావృతం అవుతుంది. నేను చెప్పింది జరగకుండా ఒక్కటీ లేదు. ఇక్కడి రాములవారీ సాక్షిగా చెబుతున్నా.. ఈ పదేళ్లు పేదల ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది.
వైఎస్సార్, ఎన్టీఆర్ గొప్ప నేతలు
రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించిన వ్యక్తి వైఎస్ రాజ శేఖరరెడ్డి. 2004లో ముఖ్యమంత్రిగా మొదటి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైల్‌పై పెట్టడమేకాక రూ.1,300 కోట్ల రైతుల బకాయిలను రద్దు చేశారు. ప్రస్తుతం మేము 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వైఎస్సార్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. మేము ఇప్పుడు గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. పార్టీలు వేరైనా వైఎస్సార్, ఎన్టీఆర్ గొప్ప నేతలు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. వీరిని స్ఫూ ర్తిగా తీసుకుని పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పట్టణ పేదలకూ అర్హత కల్పిస్తాం.
మాది కలిసి పనిచేసే ప్రభుత్వం
నాకన్నా అనుభవజ్ఞులైన నేతలు ఈ వేదికపై ఉన్నారు. సహచర మంత్రుల అనుభవాలను ఉపయోగించుకుంటూ, అందరి సమన్వయం, సహకారంతో ముందుకెళ్తు న్నాం. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం తుమ్మలకు ఉంది. సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు, 100 రోజుల్లో అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెబితే ఆయనే చూసు కున్నారు. ఢిల్లీలో ఏ పని ఉన్నా డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క చూసుకుంటారు. ఇలా మాలో ఏకాభిప్రాయమే తప్ప, ఏకపాత్రాభినయం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి. బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలి. ఏకలింగం, తోకలింగం లాంటి బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా గెలిస్తే మున్నేరు, పాలేరు ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఉంది. భద్రాచలం రామాలయానికి రూ.100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇవ్వలేదు. మేము ఇప్పటికే భూసేకరణ కోసం నిధులు ఇచ్చాం. అయోధ్య తరహాలో భద్రాచలంలో రామాలయ నిర్మాణాన్ని చేపడతాం’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
గ్రామాల్లో బీఆర్‌ఎస్ దిమ్మెలు కూలాలి
తెలంగాణలో నందమూరి తారకరామారావుకు అభి మానులు ఉన్నారు.. చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వారందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కక్ష కట్టి.. ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన చంద్రశేఖర్‌రావు, బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల గొయ్యి తీసి సమూలంగా పాతిపెట్టాలి. బీఆర్‌ఎస్ వాళ్లు గద్దె దిగాలి.. గ్రామా ల్లో బీఆర్‌ఎస్ దిమ్మెలు కూలాలి. అప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతాం.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పాలేరు నియోజకవర్గం మద్దులపల్లిలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి వద్ద నర్సింగ్ కళాశాల ఆవరణలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, కూసుమంచి మండలంలో వంద పడకల ఆస్పత్రి, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ భవనాల ప్రారంభోత్సవ పైలాన్‌లను సీఎం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు వేంనరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు మువ్వా విజయ్‌బాబు, రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, తోట దేవిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
విద్య, వైద్యం, ఆరోగ్యంపై ప్రధాన దృష్టి
ప్రభుత్వం నీటిపారుదల, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులం ఈ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే సీతారామ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. ఇక విద్యారంగానికి సంబంధించి జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, వైద్య రంగానికి సంబంధించి నర్సింగ్ కళాశాల అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయాలని సీఎంను కోరుతున్నా. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజాప్రభుత్వంపై విషం
పాముకు కేవలం కోరల్లోనే విషం ఉంటుంది.. కానీ పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని, అప్పుల పాలు చేసిన ఆ నాయకులకు ఒంటి నిండా విషమే ఉంది. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. సెమీఫైనల్ అంటూ కారుకూతలు కూస్తున్న ట్విట్టర్ టిల్లుకు గ్రామపంచాయతీ ఎన్నికలే సమాధానం చెప్పాయి. ఇదే జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలి. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. జిల్లా ప్రగతిలో సాగునీటి ప్రాజెక్టులు చారిత్రక మైలురాయిగా నిలుస్తాయి. రూ.162.54 కోట్లతో నిర్మించే మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్ సమావేశంలో టీడీపీ జెండాలు
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీడీపీ జెండాలు కనిపించాయి. ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలతో కూడిన పార్టీ జెండాలతో వచ్చిన కొందరు ‘జై రేవంతన్న’ అంటూ నినాదాలు చేశారు. ఈ సభలో సీఎం అరగంటకు పైగా మాట్లాడగా.. టీడీపీ జెండాలు పట్టుకున్న వారు పలుమార్లు జెండాలను పైకెత్తి చూపుతూ నినదించారు.


