
ఏటీసీల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, మంత్రులు పొంగులేటి, పొన్నం,శ్రీధర్‌బాబు తదితరులు
ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి స్టైపెండ్
వర్చువల్‌గా 65 ఏటీసీలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
విజయనగర్ కాలనీ(హైదరాబాద్): రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతోపాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కూడా అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. యువతీయువకులు తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల అవకాశాలు కల్పింస్తుందని, ఆ అవకాశాలను సది్వనియోగం చేసుకొని భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ‘ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా రూ.2,000 స్టైపెండ్ ఇస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని, ఇది ఖర్చు కాదు. భవిష్యత్‌కు పెట్టుబడి. పని చేయాలన్న సంకల్పం కావాలి. కష్టపడి పనిచేయాలని’చెప్పారు.
తెలంగాణ పునర్మింర్మాణంలో భాగస్వాములు కావాలి
ఏటీసీల్లో శిక్షణ పొందిన తమ్ముళ్లు, చెల్లెళ్లు తెలంగాణ పునర్మింర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగడంలో మీ వంతు కృషి చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏటీసీలకు పునాదులు వేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతమున్న 65 ఏటీసీలకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడానికి ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తే, టాటా సంస్థ రూ.2,100 కోట్లు ఖర్చు చేసి ఆధునిక ఏటీసీలను తీర్చిదిద్దిందని చెప్పారు.
నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు
రాష్ట్రంలో ఏటా లక్షా 10 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నా, నైపుణ్యం లేని కారణంగా చాలామందికి ఉద్యోగావకాశాలు రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యం లేనిదే ప్రైవేట్‌లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని, అందుకే స్కిల్స్ పెంచాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభించామంటే మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్నదే మా సంకల్పమన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు హాజరయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు.