
ఆదివారం హైదరాబాద్ అమీర్‌పేటలో జరిపిన ఆకస్మిక పర్యటనలో మురికికాల్వను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
భారీ పైపులతో కూడిన వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఎస్సార్‌నగర్ ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన
బౌద్ధనగర్, గంగుబాయి బస్తీ, రిలయన్స్ లైన్‌లలో డ్రైనేజీ నాలాల పరిశీలన
మైత్రి వనం వద్ద నీరు నిలిచిపోవడంపై ఆరా..
డ్రైనేజీ వ్యవస్థ మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు
ఏడో తరగతి బాలుడితో కలిసి బౌద్ధనగర్‌లో తిరిగిన రేవంత్
వరద నీటితో ఇంట్లో పుస్తకాలు తడిచిపోయాయన్న జశ్వంత్
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న సీఎం
సాక్షి, హైదరాబాద్/అమీర్‌పేట: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలను వరద, ముంపు ముప్పు నుంచి తప్పించడానికి ప్రత్యేకంగా ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. బౌద్ధనగర్, గంగుబాయి బస్తీ, రిలయన్స్ లైన్‌లలో ఉన్న డ్రైనేజీ నాలాలను పరిశీలించారు.
మైత్రి వనం వద్ద నీరు నిలిచిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఆర్ నగర్ నుంచి బౌద్ధనగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువను చూసిన ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ ఎక్కువ ఎత్తులో ఉండటంపై ఆరా తీశారు. ఈ కారణంగానే రోడ్డు ఇరుకుగా మారడంతో పాటు వరద బౌద్ధనగర్‌ను ముంచుతోందని గుర్తించారు.
తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ మార్పు చేర్పులపై జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కాగా గంగూబాయి కుంట ప్రాంతంలో 25 ఏళ్ల క్రితం చెరువు ఉండేదని, అక్కడ బతుకమ్మ ఆడేవారమని స్థానికులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ కుంటను కొంతమంది పూడ్చేసి ప్రైమ్ ఆసుపత్రికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆ కుంట పూర్వాపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచించారు.
బాలుడి భుజంపై చేయి వేసి నడుస్తూ..
బౌద్ధనగర్‌లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఏడో తరగతి బాలుడు జశ్వంత్ వరద సమస్యను వివరించాడు. బస్తీలో మహిళలతో కలిసి నిలబడి ఉన్న జశ్వంత్‌ను పిలిచిన రేవంత్‌రెడ్డి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఆ బాలుడి భుజంపై చేయి వేసి కాలనీలో నడుచుకుంటూ వివరాలను తెలుసుకున్నారు. తాను ఏడో తరగతి చదువుతున్నానని, వర్షాకాలంలో చదువులకు దూరం అవుతున్నానని బాలుడు సీఎంకు తెలిపాడు.
శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని చెప్పాడు. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అమీర్‌పేట కార్పొరేటర్ కేతినేని సరళ.. సీఎంను కోరారు.
స్థానిక డ్రైనేజీ వ్యవస్థ వివరాలను ఆమె వెల్లడించారు. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ ప్రాంతం నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తోందని, లెవలింగ్ సరిగా లేకపోవడంతో వరద నీరు నాలాల్లోకి వెళ్లక కొన్ని బస్తీలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ, జల మండలి అధికారులు సీఎం వెంట ఉన్నారు.
ట్రంక్ లైన్ అంటే ఏమిటి?
హైదరాబాద్ మహానగర మురుగునీటి వ్యవస్థలో సుమారు 612 కిలోమీటర్ల మేర ప్రధాన సీవరేజీ ట్రంక్ లైన్ ఉండగా వాటికి అనుబంధంగా సుమారు 9,769 కిలోమీటర్ల వరకు మురుగు నీటి పైప్‌లైన్ విస్తరించి ఉంది. ఈ మొత్తం వ్యవస్థలో ట్రంక్ లైన్ కీలకం.
చిన్న చిన్న పైపుల ద్వారా వచ్చే మురుగునీటిని భారీ పైపుల్లోకి మళ్ళించి వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి లేదా మురుగు నీటిని వదిలే ప్రదేశానికి పంపించడాన్ని ట్రంక్ లైన్ వ్యవస్ధగా పిలుస్తున్నారు. ట్రంక్ లైన్లు సాధారణంగా పెద్ద వ్యాసం (600 డయా (2.5 మీటర్లు)తో కూడిన పైపులను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో మురుగునీటిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మంచిగా చదువుకో అన్నారు..!
జస్వంత్‌తో కలిసి కాలనీలో తిరుగుతున్న సీఎం రేవంత్
మా కాలనీలో నన్ను చూసిన ముఖ్యమంత్రి..‘బాబు ఇక్కడ రా’ అని పిలిచారు. ‘నిన్న మీ ఇంటి దగ్గరకు వాటర్ వచ్చాయి కదా? ఎంత వచ్చాయి?’ అని అడిగారు. నేను మునిగిపోయేంత వచ్చాయని చెప్పా. మీకు ఇంటికి ఏమైనా మరమ్మతులు కావాలా? అని అడిగితే..అవును సార్..గేట్లు పెట్టియ్యాలె సార్ అని అన్నా. పెట్టిస్తానన్న సీఎం..పుస్తకాలు తడిచాయా? అంటూ ఆరా తీశారు. ‘మంచిగా చదువుకో.. మళ్లీ వాటర్ వస్తే నాకు ఫిర్యాదు చెయ్యి కవర్ చేసేస్తా..’ అని హామీ ఇచ్చారు.
– జశ్వంత్, ఏడో తరగతి విద్యార్థి, బౌద్ధనగర్