పాలమూరులో నీ జెండా ఎగరనియ్య | CM Revanth Open Challege to KCR at Jadcherla public meeting | Sakshi
Sakshi News home page

పాలమూరులో నీ జెండా ఎగరనియ్య

Jun 6 2026 1:59 AM | Updated on Jun 6 2026 1:59 AM

CM Revanth Open Challege to KCR at Jadcherla public meeting

ఇక్కడి గడ్డ మీద మొలక కూడా ఎత్తనియ్యం.. నీ గుర్తు ఇక మర్చిపో : సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి  తీసుకొస్తా..నీకు చేతనైతే రా చూసుకుందాం 

జడ్చర్ల బహిరంగ సభలో కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ 

ప్రజలు గతంలో ఎంపీగా గెలిపిస్తే వారి కష్టాలను పట్టించుకోలేదని ధ్వజం 

ఎవరి పాలనలో ఏం జరిగిందో చర్చించేందుకు కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని పిలుపు 

కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణ కాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటన 

ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘పాలమూరు బిడ్డలకు తట్టపని, మట్టిపనే కాదు... అడ్డమొస్తే పండబెట్టి తొక్కి మట్టి కప్పేది కూడా తెలుసు. కేసీఆర్‌ గుర్తుపెట్టుకో.. నిన్ను ఇక్కడ మొలక కూడా ఎత్తనియ్యం. రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాలో నీ జెండాను ఎగరనియ్యం. గద్దెలు దిగాలె.. దిమ్మెలు కూలాలె. పాలమూరు గడ్డ మీద నీ గుర్తు ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే ఇక గతమే. భవిష్యత్తులో ఒక్కడిని కూడా గెలవనియ్యను. పాలమూరు గడ్డ నుంచి జడ్చర్ల వేదికగా కేసీఆర్‌కు ఇదే నా సవాల్‌. నీకు చేతనైతే రా చూసుకుందాం. 1994 నుంచి 2004 వరకు టీడీపీ రెండుసార్లు అధికారంలో ఉంది.

2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండో రోజు శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

వెనుకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పాలమూరు బిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే తాను ఎవరితోనైనా కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలమూరుతో సంబంధం లేకపోయినా ఇక్కడి నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి కష్టాలు చూడలేదని, కన్నీళ్లు తుడవలేదని ఆక్షేపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పెండింగ్‌లో ఉన్న ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఏడాదికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినా పదేళ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. 

మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం 
బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్‌ రెండున్నరేళ్ల పాలనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 15 లక్షల రేషన్‌ కార్డులు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 45 లక్షల కుటుంబాలకు రూ. 500కే సిలిండర్, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఆరీ్టసీలో ఉచిత ప్రయాణానికి రూ. 10 వేల కోట్లు, 67,616 మందికి ఉద్యోగాలు, 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా కోసం రూ. 27 వేల కోట్లు, వ్యవసాయం కోసం రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చుచేశాం. నీ పేరు కేసీఆర్‌ అయితే అసెంబ్లీకి రావాలి. ఈ విషయంపై చర్చ చేద్దాం. ఓడితే క్షమాపణ చెప్తా. నువ్వు ఓడిపోతే ఫాంహౌస్‌లో పడుకో. బిల్లా, రంగాలను ఊరిపై వదిలిండు. ఒకడు పొద్దున ప్రెస్‌మీట్‌ పెడితే, మరొకడు సాయంత్రం ట్విట్టర్‌లో పెడతడు. మీ మధ్యలోనే పొంతన లేదు. మాకు సుద్దులు చెబుతారా?’అని మండిపడ్డారు. 

కృష్ణా, గోదావరి నీటికి శాశ్వత పరిష్కారం చూపుతాం.. 
‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కడతాం. బీజేపీ నేతలు తమాషా చేయడం కాదు. మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా దాగుడుమూతలు ఆడి పారిపోతుండు. మర్యాదగా పట్టుకురండి. ఈ ప్రాజెక్టుతో ఎల్లంపల్లికి 100 టీఎంసీల నీళ్లు తీసుకొస్తాం. కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణకాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతాం. పగోడైనా, పక్క దేశమైనా చర్చలు లేకుండా పరిష్కారం కావు. ఆలీ, పాలీ పంచాయితీకైనా పెద్ద మనిషి కావాలి. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. డిసెంబర్‌లోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం ఎన్‌ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది. 

మరో రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బరాజ్‌ నిర్మాణం చేపడతాం. ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం’అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బహిరంగ సభలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement