మెట్రోపై జాప్యం తగదు | CM Revanth letter to Union Ministers Khattar and Kishan Reddy | Sakshi
Sakshi News home page

మెట్రోపై జాప్యం తగదు

Jul 6 2026 4:56 AM | Updated on Jul 6 2026 4:56 AM

CM Revanth letter to Union Ministers Khattar and Kishan Reddy

జూన్‌ 24 నిర్ణయాలను కేంద్రం అమలు చేయాలి

ఎస్‌బీఐ క్యాప్స్‌కు వెంటనే బాధ్యతలు అప్పగించాలి 

కేంద్ర మంత్రులు ఖట్టర్, కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు తొలి దశ, రెండో దశ ప్రాజెక్టులకి సంబంధించి కీలకమైన నిర్ణయాల అమలులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డికి ఆయన లేఖలు రాశారు. హైదరాబాద్‌ మెట్రో తొలి దశ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అత్యంత కీలకమని ఈ లేఖల్లో ఆయన పేర్కొన్నారు. 

ఈ రెండు అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డితో గత జూన్‌ 24న నిర్వహించిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఆయన కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మెట్రో తొలి దశ ప్రాజెక్టు విలువను అంచనా వేయడం, దాని ఆర్థికస్థితిని పరిశీలించడంతోపాటు రెండో దశ ప్రాజెక్టుకి ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలను అన్వేషించే బాధ్యతలను ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌(ఎస్‌బీఐ క్యాప్స్‌) సంస్థకు బాధ్యతలను అప్పగించాలని ఆ సమావేశంలో నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఈ నిర్ణయం జరిగి చాలా రోజులు గడిచినా, ఇప్పటి వరకు ఎస్‌బీఐ క్యాప్స్‌కు బాధ్యతలు అప్పగించలేదని, అలాగే ఈ ప్రక్రియకు సంబంధించిన నియమనిబంధనలు సైతం ఖరారు చేయలేదని ప్రస్తావించారు. ఈ జాప్యంతో మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టు నిర్వహణలో అనిశ్చితి నెలకొనడమే కాకుండా, రెండో దశ నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఎస్‌బీఐ క్యాప్స్‌కు బాధ్యతలను తక్షణమే అప్పగించేలా చూడాలని, తద్వారా మెట్రో విస్తరణ పనులు వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకునేలా మంత్రి కిషన్‌ రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు.   మజ్లిస్‌ను బుజ్జగిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement