
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనుంది. జూన్ 2న ఉదయం గన్‌పార్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకులకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో సోనియాతో రేవంత్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నేతగా సోనియా గాంధీని ఆహ్వానించినట్లు చెప్పారు. ఆహ్వానాన్ని మన్నించి వేడుకలకు సోనియాగాంధీ హాజరవుతానని చెప్పారని తెలిపారు. తమ అందరి తరఫున సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఆ జాబితాను తయారు చేయాల్సిందిగా కోదండ రామ్‌కు బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. ఉద్యమకారులందరికీ సమచిత గౌరవం దక్కుతుందన్నారు. ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి ఆవిర్భావ వేడుకలు ఇవేనని రేవంత్ రెడ్డి తెలిపారు.