మేం పన్నులు కట్టి.. ఢిల్లీకి సలాం కొట్టాలా? | CM Revanth in an interview with The Hindu Group Director N Ram | Sakshi
Sakshi News home page

మేం పన్నులు కట్టి.. ఢిల్లీకి సలాం కొట్టాలా?

Jun 7 2026 4:19 AM | Updated on Jun 7 2026 4:19 AM

CM Revanth in an interview with The Hindu Group Director N Ram

పార్లమెంట్‌ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం 

పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దు 

తెలంగాణకు వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు వెళ్లి పెట్టమంటున్నారు  

త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌  

హిట్లర్‌ స్ఫూర్తితోనే ‘హైడ్రా’ 

రోజుకు 16–18 గంటలు పని చేస్తా.. నాకు వేరే ఇతర వ్యాపకాలు లేవు  

‘ది హిందూ’గ్రూప్‌ డైరెక్టర్‌ ఎన్‌.రామ్‌తో ముఖాముఖిలో సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారు. పార్లమెంట్‌ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. వాళ్లు చెప్పినట్లు పార్లమెంట్‌ సీట్లు పెంచితే కేరళలో లోక్‌సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120కి పెరుగుతాయి. మేం దీనినే వ్యతిరేకిస్తున్నాం. పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కోరుతున్నాం. 

దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ. తీసుకునేది తక్కువ. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అంతా ఉత్తరాది రాష్ట్రాలవారే. మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా?..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే 2027లో జరిగే యూపీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయాలని సవాలు విసిరారు. ‘వాళ్లు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. 

ఉత్తరాది, దక్షిణాది అంతరాలు పెంచొద్దు’అని కేంద్రానికి హితవు పలికారు. ‘ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల చేత: తెలంగాణకు సుపరిపాలన’అనే అంశంపై శనివారం బెంగళూరులో ‘ది హిందూ’గ్రూప్‌ డైరెక్టర్‌ ఎన్‌.రామ్‌ నిర్వహించిన ముఖాముఖిలో రేవంత్‌ పాల్గొని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రేవంత్‌ ఏమన్నారంటే.. 

రాష్ట్ర పెట్టుబడులు గుజరాత్‌కు మళ్లింపు 
కేంద్రంపై ప్రతిపక్షంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతాం. మా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు అనుమతులు ఇవ్వకుండా గుజరాత్‌ వెళ్లి పెట్టాలని వాళ్లు (మోదీ ప్రభుత్వం) ఒత్తిడి చేస్తున్నారు. బలవంతంగా గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఒకే ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌ అక్కడ పని చేస్తున్నారు.  
18 గంటలు పని.. ఫ్రెండ్స్‌ లేరు.. 

రోజుకు 16–18 గంటలు పనిచేస్తా. వేరే ఇతర వ్యాపకాలు లేవు. అదే నాకు పెద్ద సమస్య. సమయం గడపాలంటే రాజకీయ స్నేహితులు తప్ప వేరే ఎవరూ లేరు. రాత్రి 10 గంటల తరా>్వత ఫుట్‌బాల్‌ ఆడతా. ఇప్పుడు సమయం చిక్కడం లేదు. నేను మెస్సీకి అభిమానిని. అందుకే మెస్సీని ఆహ్వానించి కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

 కేసీఆర్‌ ఆ సమస్యను పరిష్కరించలేదు. గతంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ టీజీపీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు. టీజీపీఎస్సీ పునరావాస కేంద్రం కాకూడదు. యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులను కలిసి ఎలా పని చేస్తుందో తెలుసుకుని టీజీపీఎస్సీలో అమలు చేశా. 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తాం.  

కేసీఆర్‌ మీడియాకూ అనుమతిస్తా.. 
పది రోజులకో ప్రెస్‌మీట్‌ నిర్వహించి ప్రతి ప్రశ్నకూ జవాబిస్తా. కేసీఆర్‌ మీడియా సంస్థ ప్రతినిధినీ అనుమతిస్తా. ఎంత లేటైనా జర్నలిస్టులతో మాట్లాడతా. వ్యతిరేక వార్తలు రాస్తే దూషించను. వ్యంగ్యంగా మాట్లాడతా. చెరువులు, నాలాలను పేదలు ఆక్రమించుకుంటే అర్ధం చేసుకోగలం. పెద్దవాళ్లు జల వనరులను చెరబడుతుంటేనే హైడ్రాను ఏర్పాటు చేశా. 

‘హైడ్రా’.. ఇది హిట్లర్‌కు ఫేవరేట్‌ పదం. అతడి కోర్‌ టీమ్‌ పేరు హైడ్రా... ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్‌ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టాను. మా దగ్గర ఎవరైనా జల వనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మహానగరాల్లో ఆక్రమణలు, పర్యావరణం, నీటి కొరతపై సొంత మోడళ్లను అనుసరించాలి. 

జీఎస్టీ ఆదాయం పెంచాం.. 
వడ్డీలను 11–11.50 శాతం నుంచి 7–8 శాతానికి తగ్గించుకోవడానికి రూ.2 లక్షల కోట్ల అప్పులను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నాం. గత 7–8 ఏళ్లలో నెలకు రూ.3,500 కోట్లకు మించి జీఎస్టీ రాబడి లేదు. గత ఆరు నెలలుగా రూ.4 వేల కోట్లను దాటుతున్నాం. ఆరు నెలల్లోనే రూ.5 వేల కోట్లు అదనంగా వచ్చింది.   

రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రం  
మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి. రూ.20,616 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశా. 2024–25లో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ఏఐ బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు ప్రత్యామ్నా యం సృష్టించలేదు. ఏఐ అన్నీ సృష్టించ వచ్చు. రాజకీయ నాయకున్ని సృష్టించలేదు.

నాకు ఏఐ భయం లేదు. యువతరం స్కిల్స్‌ పెంచుకోవాలి. అధికారులు ఏం అడిగినా ‘యెస్‌..’అంటారు. నేను ముందుగా ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని రాసుకుంటా. చివరకు నా అభిప్రాయం చెబుతా. ముందే నా అభిప్రాయం చెబితే దానికి అనుగుణంగా వారు చెబుతారు. 17 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎంతో తెలుసుకున్నా. నన్ను తప్పుదోవ పట్టించలేరు. నేను ప్రతి బ్యూరోక్రాట్‌ మైండ్‌సెట్‌ను అర్ధం చేసుకోగలను.  

Advertisement
 
Advertisement
Advertisement