డిజిటల్‌ భద్రతతోనే అభివృద్ధి | CM Revanth at the inauguration of Google Safety Engineering Center | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ భద్రతతోనే అభివృద్ధి

Jun 19 2025 3:31 AM | Updated on Jun 19 2025 3:31 AM

CM Revanth at the inauguration of Google Safety Engineering Center

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో డిజిటల్‌ సెక్యూరిటీయే కీలకం 

గూగుల్‌ ఒక వినూత్న సంస్థ.. మాది ఒక వినూత్న ప్రభుత్వం 

గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ప్రారంబోత్సవంలో సీఎం రేవంత్‌ 

ఆసియా–పసిఫిక్‌లోహైదరాబాద్‌లోనే మొదటి జీసెక్‌: శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ఐటీ సేవల సంస్థ గూగుల్‌ ప్రారంభంతో ప్రపంచమే మారిపోయి మానవ జీవితం డిజిటల్‌మయంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే, గోప్యత, భద్రతకు డిజిటలైజేషన్‌ సవాలు విసురుతోందని, డిజిటల్‌గా సురక్షితంగా ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గూగుల్‌ దివ్యశ్రీ భవన్‌లో కొత్తగా ఏర్పాటైన ‘గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌’(జీసెక్‌)ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధునాతన సైబర్‌ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. 

జీసెక్‌ నైపుణ్యాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు దోహదం చేస్తుందని, దేశ సైబర్‌ భద్రత ప్రమాణాలను పెంచుతుందని చెప్పారు. ‘చెడు చేయొద్దనే గూగుల్‌ సంస్థ విధానాన్ని నేను ఇష్టపడతాను. గూగుల్‌ తరహాలోనే మా ప్రభుత్వం కూడా మంచి పనులు మాత్రమే చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు అనువైన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్లకు చేర్చేదిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

మహిళలు, రైతులు, యువత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గూగుల్‌ మద్దతును కోరుతున్నా. తెలంగాణతో గూగుల్‌ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం.. ఇలా అనేక రంగాలలో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నాం. గూగుల్‌ ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వం’అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  

ఏఐ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ సవాలు: శ్రీధర్‌బాబు 
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కేకొద్దీ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఒక్క క్షణం అప్రమత్తంగా లేకపోయినా సైబర్‌ మోసాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే మొదటి జీసెక్‌ను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. 

‘సేఫ్‌ డిజిటల్‌ తెలంగాణ 2.0’లక్ష్యానికి అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే సురక్షిత ఇంటర్నెట్‌ వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎంపీ మల్లు రవి, గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్లు అరిజీత్‌ సర్కార్, హీతర్‌ అడ్కిన్స్, విల్సన్‌ వైట్, గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ ప్రీతి లబానా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

భారత్‌లో తొలి సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ 
గూగుల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్లలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినది నాలుగోది. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో ఇదే మొట్టమొదటిది కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో సీఎం రేవంత్‌ అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్‌ హెడ్‌ ఆఫీసును సందర్శించిన సమయంలో హైదరాబాద్‌లో జీసెక్‌ ఏర్పాటు కోసం చొరవ చూపారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా 2024’సదస్సులో భారత్‌లో జీసెక్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. దీని ఏర్పాటుకు గత ఏడాది డిసెంబర్‌ 4న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 

అంతర్జాతీయ సెక్యూరిటీ హబ్‌గా జీసెక్‌ అధునాతన భద్రత, ఆన్‌లైన్‌ భద్రతా ఉత్పత్తుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత భద్రత, అత్యాధునిక పరిశోధన రంగంలో పనిచేస్తున్న నిపుణులకు ఇది సహకార వేదికగా ఉపయోగపడుతుంది. జీసెక్‌ ద్వారా ఐటీ రంగంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement