సమగ్ర సర్వే మెగా హెల్త్‌ చెకప్‌లాంటిది..: సీఎం రేవంత్‌ | CM Revanth Comments On comprehensive survey | Sakshi
Sakshi News home page

సమగ్ర సర్వే మెగా హెల్త్‌ చెకప్‌లాంటిది..: సీఎం రేవంత్‌

Jul 20 2025 1:40 AM | Updated on Jul 20 2025 1:40 AM

CM Revanth Comments On comprehensive survey

సీఎం రేవంత్‌రెడ్డికి అధ్యయన నివేదికను అందిస్తున్న స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి. చిత్రంలో నివేదిక ప్రతులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొన్నం, సీతక్క, కమిటీ వైస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య తదితరులు

అది కేవలం సమాచార నివేదిక కాదు 

సామాజిక న్యాయానికి అదే కీలకం 

సర్వేపై నియమించిన నిపుణుల కమిటీ భేటీలో సీఎం రేవంత్‌ 

కుల సర్వేపై సీఎంకు కమిటీ నివేదిక.. 

దీనిపై కేబినెట్‌లో చర్చించి చర్యలు తీసుకుంటామన్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే.. కేవలం సమాచార నివేదిక కాదని, రాష్ట్రానికి మెగా హెల్త్‌ చెకప్‌ లాంటి దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సర్వే నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, సభ్యులు ప్రొఫెసర్‌ శాంతాసిన్హా, ప్రొఫెసర్‌ హిమాన్షు, డా.సుఖ్‌దేవ్‌ తొరాట్, నిఖిల్‌ డే, ప్రొఫెసర్‌ భాంగ్య భూక్య, ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి, ప్రొఫెసర్‌ జీన్‌డ్రెజ్, ప్రొఫెసర్‌ థామస్‌ పికెట్టి, ప్రవీణ్‌ చక్రవర్తి, కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టితో సీఎం శనివారం సమావేశమయ్యారు. కమిటీ తన అధ్యయన నివేదికను సీఎం సమర్పించింది. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సమగ్ర సర్వేను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సమగ్ర సర్వేపై చేపట్టిన అధ్యయన నివేదిక రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 

రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, ఇందుకుగల కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలని కోరారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

దేశ దిశను మార్చనున్న సమగ్ర సర్వే.. 
సమగ్ర సర్వే, దానిపై నిపుణుల కమిటీ అధ్యయన నివేదిక దేశ దిశను మారుస్తాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సమగ్ర సర్వేపై వివాద రహితులైన వివిధ రంగాల మేధావులతో కమిటీ వేయటం చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఇలాంటి సర్వే దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదని తెలిపారు. బిహార్‌లో సర్వే చేసినప్పటికీ న్యాయస్థానాల్లో దానికి బ్రేకులు పడ్డాయని గుర్తుచేశారు. 

సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే లోపం ఉందని ఎవరూ చెప్పలేదని తెలిపారు. సీఎంగా, స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్‌గా, కుల గణన కమిటీ చైర్మన్‌గా రెడ్లు ఉన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలన్న బాధ్యతతో పని చేయడంతో సర్వే విజయవంతమైందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.శరత్‌ తదితరులు పాల్గొన్నారు.  

రెండు భాగాలుగా నివేదిక 
సమగ్ర సర్వేను దాదాపు నాలుగు నెలల పాటు స్వతంత్ర కమిటీ అధ్యయనం చేసింది. సమగ్ర సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల ప్రజల స్థితిగతులు.. విద్య, భూమి, సంక్షేమం, ఉపాధి రంగాల్లో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందనే అంశాలను భిన్న కోణాల్లో పరిశీలించింది. రాష్ట్రంలో 242 కులాల వెనుకబాటుతనాన్ని విశ్లేషణ చేసింది. 

కంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌నెస్‌ ఇండెక్స్‌ను తయారు చేసి కులాలకు గ్రేడింగ్‌/ర్యాంకు ఇచ్చింది. ఈ నివేదిక 320 పెజీల్లో ఉండగా... దీన్ని రెండు భాగాలుగా ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రజలకు అనువైన విధంగా సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సూచించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement