breaking news
mega health camp
-
సమగ్ర సర్వే మెగా హెల్త్ చెకప్‌లాంటిది..: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే.. కేవలం సమాచార నివేదిక కాదని, రాష్ట్రానికి మెగా హెల్త్ చెకప్ లాంటి దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సర్వే నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సభ్యులు ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, డా.సుఖ్‌దేవ్ తొరాట్, నిఖిల్ డే, ప్రొఫెసర్ భాంగ్య భూక్య, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ప్రొఫెసర్ జీన్‌డ్రెజ్, ప్రొఫెసర్ థామస్ పికెట్టి, ప్రవీణ్ చక్రవర్తి, కార్యదర్శి అనుదీప్ దురిశెట్టితో సీఎం శనివారం సమావేశమయ్యారు. కమిటీ తన అధ్యయన నివేదికను సీఎం సమర్పించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సమగ్ర సర్వేను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సమగ్ర సర్వేపై చేపట్టిన అధ్యయన నివేదిక రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, ఇందుకుగల కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలని కోరారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశ దిశను మార్చనున్న సమగ్ర సర్వే.. సమగ్ర సర్వే, దానిపై నిపుణుల కమిటీ అధ్యయన నివేదిక దేశ దిశను మారుస్తాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సమగ్ర సర్వేపై వివాద రహితులైన వివిధ రంగాల మేధావులతో కమిటీ వేయటం చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఇలాంటి సర్వే దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదని తెలిపారు. బిహార్‌లో సర్వే చేసినప్పటికీ న్యాయస్థానాల్లో దానికి బ్రేకులు పడ్డాయని గుర్తుచేశారు. సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే లోపం ఉందని ఎవరూ చెప్పలేదని తెలిపారు. సీఎంగా, స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్‌గా, కుల గణన కమిటీ చైర్మన్‌గా రెడ్లు ఉన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలన్న బాధ్యతతో పని చేయడంతో సర్వే విజయవంతమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.శరత్ తదితరులు పాల్గొన్నారు. రెండు భాగాలుగా నివేదిక సమగ్ర సర్వేను దాదాపు నాలుగు నెలల పాటు స్వతంత్ర కమిటీ అధ్యయనం చేసింది. సమగ్ర సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల ప్రజల స్థితిగతులు.. విద్య, భూమి, సంక్షేమం, ఉపాధి రంగాల్లో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉందనే అంశాలను భిన్న కోణాల్లో పరిశీలించింది. రాష్ట్రంలో 242 కులాల వెనుకబాటుతనాన్ని విశ్లేషణ చేసింది. కంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్‌ను తయారు చేసి కులాలకు గ్రేడింగ్/ర్యాంకు ఇచ్చింది. ఈ నివేదిక 320 పెజీల్లో ఉండగా... దీన్ని రెండు భాగాలుగా ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రజలకు అనువైన విధంగా సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సూచించారు. -
వైఎస్సార్ మెగా వైద్య శిబిరాల పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ రాష్ట్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 100 మెగా వైద్యశిబిరాల ప్రారంభోత్సవ పోస్టరును బుధవారం విశాఖలోని ఆరిలోవ కూడలిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలో డెంగీ, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందున వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి మెగా వైద్య శిబిరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.శివభరత్‌రెడ్డి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచిందని, ఆరుమాసాలుగా రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు మంత్రే లేడని, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి రావడం చంద్రబాబుకు సిగ్గు చేటన్నారు. -
నేడు ఎక్సైజ్ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంపు
కర్నూలు: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో శనివారం మెగా హెల్త్‌క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్న ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు కోరిక మేరకు మై క్యూర్ హాస్పిటల్ వారు ఉచితంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా ఎక్సైజ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మావతి సూచించారు.