
శుక్రవారం సినీ ప్రముఖులతో చర్చిస్తున్న మంత్రి తలసాని. చిత్రంలో దిల్ రాజు, రాజమౌళి, త్రివిక్రమ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనా వల్ల రెండేళ్లుగా చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
త్వరలో ‘పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతుండటంతో పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు శుక్రవారం హైదరాబాద్‌లో తలసానిని కలసి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సీఎంతో చర్చించాక...:‘‘సినిమా నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ల నిర్వహణ ఖర్చు పెరిగిందని, కరోనా వల్ల ఇండస్ట్రీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని సినీ ప్రముఖులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న టికెట్ల ధరలపై అధ్యయనం చేసి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టికెట్ల ధరల పెంపుపై తగు నిర్ణయం తీసుకుంటాం’’ అని మంత్రి తలసాని మీడియాకు వివరించారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు: ‘దిల్’ రాజు
‘‘కోవిడ్ థర్డ్ వేవ్ వస్తోంది. మళ్లీ థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత? పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే అంశాలపై మంత్రి తలసానితో మాట్లాడాం. రెండేళ్ల కిందట పరిశ్రమ తరఫున ప్రభుత్వానికి చేసిన వినతులపైనా చర్చించాం. టికెట్ ధరలు, కరెంట్ బిల్లులు, కోవిడ్... ఇలా ఐదారు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తలసాని హామీ ఇచ్చారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు.
తలసానితో భేటీలో నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు), సునీల్ నారంగ్, డీవీవీ దానయ్య, రాధాకృష్ణ, నవీన్ ఎర్నేని, వంశీ, బాల గోవిందరాజు, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్‌బాబు పాల్గొన్నారు.