CM KCR To Inaugurate District Collectorate Complex Of Mahabubabad - Sakshi
Sakshi News home page

KCR: వాళ్లు చెప్పినట్టు వింటే.. తాలిబన్‌ రాజ్యమే

Published Thu, Jan 12 2023 2:25 PM

CM KCR Inaugurates District Collectorate complex at Mahabubabad - Sakshi

దేశాన్ని రక్షించేందుకు తెలంగాణ బిడ్డలు ముందుకు రావాలి ప్రజలు అభివృద్ధి వైపు సాగాలంటే సమాజంలో శాంతి, సహనం అవసరం. మతపిచి్చ, కులపిచ్చి పెంచి విద్వేషాలు రెచ్చగొడితే దేశం తిరోగమనం వైపు పయనిస్తుంది. మేధావులు, యువత దీనిపై ఆలోచన చేయాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో పరిశీలన చేయాలి. మనం బాగున్నాం కదా, పొరుగింటోళ్లు ఏమైపోతే ఏమిటని అనుకుంటే, ఓ రోజు మనకూ ప్రమాదం వస్తుంది. అందువల్ల ఉద్యమ పంథా, పోరాట రక్తమున్న తెలంగాణ బిడ్డలు ఈ దేశాన్ని రక్షించడానికి ముందుకు రావాలి. 
– సీఎం కేసీఆర్‌ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ సాక్షి, మహబూబాబాద్‌/భద్రాద్రి కొత్తగూడెం: ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలు ఫలిస్తే రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతుంది. సమాజం మరో తాలిబన్‌లా మారిపోతుంది. ఇక్కడికి పెట్టుబడులు రావు. ఉద్యోగాలు, ఉపాధి లభించవు. మన చుట్టూ జరుగుతున్న విద్వేష రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. దీనిపై సమాజంలో చర్చ జరగాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నూతన కలెక్టరేట్లను, బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఆయా చోట్ల కలెక్టర్లను వారి చాంబర్లలోని కుర్చీల్లో కూర్చోబెట్టి అభినందించారు. తర్వాత రెండు చోట్ల నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. దేశానికే మార్గదర్శకంగా నిలిచాం. దీనికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. రెండు రోజులు చెప్పినా అవి ఒడవవు. తెలంగాణలో గతంలో 3 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ధైర్యం చేసి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. ప్రజలు సంక్షేమ పథకాల జాతరను అనుభవిస్తున్నారు. గతంలో 600 ఫీట్లు బోరు వేసినా నీరు ఉండేది కాదు. ప్రస్తుతం సమృద్ధిగా నీరు,కరెంట్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రజలకు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో మంత్రుల చాంబర్‌ కంటే తెలంగాణలో కలెక్టర్‌ చాంబర్‌ అద్భుతంగా ఉందని పంజాబ్‌ మంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

కేంద్ర అసమర్థత వల్లే తగ్గిన ఆదాయం 
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.5లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.11.54 లక్షల కోట్లకు చేరింది. మనస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.14.5 లక్షల కోట్లకు చేరేది. కేంద్ర అసమర్థ పనితీరు వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దాదాపు రూ.3 లక్షల కోట్ల నష్టం జరిగింది. అన్ని రాష్ట్రాలను కలిపితే ఈ నష్టం మరెంతో ఉంటుంది. 

జల వివాదాలు తీర్చడం లేదు 
దేశవ్యాప్తంగా నదుల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నా.. రైతుల పొలాల వద్దకు రావు. కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ 19 ఏళ్లు గడిచినా తీర్పు ఇవ్వలేదు. మనం మొండి పట్టుదలతో తెగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. నీటి సమస్య లేకుండా చేసుకున్నాం. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నా నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం తాగునీటి సమస్య తీరలేదు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి ఇంకా ఉండటం ఏమిటి? 10 రోజులకోసారి నీళ్లు సరఫరా చేసే దుస్థితికి కారణాలేమిటి? ఇప్పటివరకు కేంద్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌ల అసమర్థత, తప్పుడు విధానాల ఫలితమే ఇది...’’ అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. 

బిజీ బిజీగా కార్యక్రమాలు 
సీఎం కేసీఆర్‌ తొలుత హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ నూతన కలెక్టరేట్‌ను, జిల్లా గ్రంధాలయాన్ని, బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌ సమీపంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తర్వాత హెలికాప్టర్‌ ద్వారా కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్‌.. తొలుత కొత్తగూడెం–పాల్వంచ మధ్యలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన సభలో మాట్లాడారు.

తర్వాత రోడ్డు మార్గంలో కొత్తగూడెం వెళ్లి బీఆర్‌ఎస్‌ జిల్లా ఆఫీసును ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, బానోతు హరిప్రియ, చల్లా ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 


 
నూకల రాంచంద్రారెడ్డి విగ్రహాలు పెడతాం: కేసీఆర్‌ 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ఆదర్శ నాయకుడు నూకల రాంచంద్రారెడ్డి అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. తొలి ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చాలామంది నాయకులకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు అయితే.. పీవీకి గురువు నూకల రాంచంద్రారెడ్డి అన్నారు. అలాంటి నేత గురించి ఈ తరం యువతకు తెలపడం ప్రభుత్వ బాధ్యత అని.. మహబూబాబాద్, వరంగల్‌ పట్టణాల్లో ప్రభుత్వ ఖర్చులతో రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏదైనా ఒక ఇనిస్టిట్యూట్‌కు ఆయన పేరు పెడతామన్నారు. 
 
రెండు జిల్లాలకు వరాలు 
మహబూబాబాద్‌కు కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను మంజూరు చేస్తున్నామని.. వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇక అభివృద్ధి పనుల కోసం మహబూబాబాద్‌ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా 3 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం ప్రత్యేక నిధులనుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. 

– భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధిని మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు రూ.40 కోట్ల చొప్పున.. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
పాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతాం: సీఎస్‌ శాంతికుమారి 
రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, పరిపాలనా ఫలాలను ప్రజలకు చేర్చేందుకు ఉద్యోగుల భాగస్వామ్యం పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తాను జిల్లాలో పనిచేసినప్పుడు కలెక్టర్‌ కార్యాలయాలు ఇరుకు గదులతో టాయిలెట్స్‌ కూడా సరిగాలేక ప్రజలు ఇబ్బంది పడేవారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్లు ఇంద్ర భవనాల్లా ఉన్నాయని, వీటిని చూస్తే అసూయగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అడగకుండానే వరాలిచ్చే కేసీఆర్‌: మంత్రి ఎర్రబెల్లి 
అడిగితే వరాలు ఇచ్చేవాళ్లు ఉంటారేమోగానీ.. సీఎం కేసీఆర్‌ మాత్రం అడగకుండానే కష్టాలను అర్థం చేసుకొని వరాలు ఇచ్చే పేదల ఆరాధ్య దైవమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. ఇదే తరహాలో ఆయన మానుకోట ప్రజలపై చల్లని చూపు సారించాలని కోరారు. సీఎం ఆశీస్సులతో మానుకోట అభివృద్ధిలో బంగారు కోట కావాలని ఆకాంక్షించారు. 

 
Advertisement
 
Advertisement