సింగరేణి కార్మికులకు గుడ్‌ న్యూస్‌.. లాభాల బోనస్‌ ప్రకటన

CM KCR Giving Nod For Singareni Bonus For 2022 - Sakshi

2021-22లో సింగరేణి మొత్తం టర్నోవర్‌ రూ. 26,607 కోట్లు. నికర లాభాలు రూ. 1,227 కోట్లు

30 శాతం లాభాల బోనస్‌గా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

కృతజ్ఞతలు తెలిపిన సి అండ్‌ ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌

లాభాల బోనస్‌గా రూ. 368 కోట్లను అందుకోనున్న ఉద్యోగులు

అక్టోబర్‌ 1వ తేదీన చెల్లింపు : సి అండ్‌ ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ వెల్లడి

70 మిలియన్‌ టన్నుల లక్ష్య సాధనకి పునరంకితమై పనిచేయాలని పిలుపు

సాక్షి, హైద‌రాబాద్: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక ప్ర‌క‌టించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ద‌స‌రా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని సీఎం ఆదేశించారు. దీంతో అర్హులైన కార్మికుల‌కు రూ. 368 కోట్ల‌ను సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది.

సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా పరిస్థితుల్ని అధిగమించి..
దేశంలో గత రెండేళ్లుగా నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి 2021-22 లో రికార్డు స్థాయిలో 26,607 కోట్ల రూపాయల టర్నోవర్‌ ను సాధించింది సింగరేణి. మొత్తం టర్నోవర్‌ పై పన్నులు విధించడానికి ముందుకు 1,722 కోట్ల రూపాయల లాభాలను ఆర్థించినట్లు సంస్థ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ శ్రీ ఎన్‌.శ్రీధర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్‌ పై నికర లాభాలు రూ.1,227 కోట్లుగా (పన్నులు చెల్లించిన తర్వాత) ఉన్నట్లు తెలిపారు. అలాగే గత ఏడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 3,596 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.

అక్టోబర్‌ 1వ తేదీన లాభాల వాటా చెల్లింపు
సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటాను దసరా కానుకగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కార్మికులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సీ అండ్‌ ఎండీ. ఈ ఏడాది లాభాల వాటాగా కార్మికులు రూ.368 కోట్లను అందుకోనున్నారని వివరించారు. దాదాపు 44 వేల మంది ఉద్యోగులకు లాభాల వాటాను అక్టోబర్‌ 1వ తేదీన (శనివారం) చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. 

70 మిలియన్‌ టన్నుల లక్ష్యంతో..
2021-22 లో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 655 లక్షల టన్నుల రవాణా చేసిందన్నారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ద్వారా 88.08 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను గ్రిడ్‌ కు సరఫరా చేసినట్లు వివరించారు. అలాగే ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి ప్రతీ ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని, తద్వారా రికార్డు స్థాయి టర్నోవర్‌, లాభాలు సాధించవచ్చని తద్వారా మరిన్ని ఎక్కువ లాభాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top