రాష్ట్రానికి కేటాయింపులు పెంచండి: సీఎం కేసీఆర్‌

CM KCR Appeals To Prime Minister Modi Over Phone - Sakshi

రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం

ప్రతిరోజూ 2–2.5 లక్షల వ్యాక్సిన్లు పంపండి

రెమిడెసివిర్‌ కోటా 25 వేలకు పెంచండి

ప్రధాని మోదీకి ఫోన్‌లో సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కేటాయింపులను పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాని గురువారం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తమిళనాడు లోని శ్రీపెరంబదూర్, కర్ణాటకలోని బళ్లారి నుం చి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్‌ రావడం లేదని ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వైద్య సేవల కోసం నగరంపైనే ఆధారపడుతున్నారని తెలియజేశారు. కరోనా చికిత్స కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి రోగులు హైదరాబాద్‌కు వస్తుండటంతో నగరంపై ఒత్తిడి పెరిగిందని, దీంతో ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమిడెసివిర్‌ కు తీవ్రంగా కొరత ఏర్పడుతోందని వివరించారు.

రాష్ట్రానికి రోజుకు 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే అందుతోందని, 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రోజుకు 4,900 రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు మాత్రమే అందుతున్నాయని, వాటిని 25 వేలకు పెంచాలని కోరారు. ఇప్పటివరకు కేంద్రం రాష్ట్రానికి 50 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేసిందని, రాష్ట్రంలో రోజుకు 2–2.5 లక్షల డోసుల వాక్సిన్ల అవసరం ఉందని, వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధానికి కేసీఆర్‌ విన్నవించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కేసీఆర్‌తో మాట్లాడారు. ప్రధానికి చేసిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ను సత్వరమే సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ సరఫరా జరిగేలా చూస్తామన్నారు. 
     
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top