రుణాలు బడా వ్యాపారులకేనా.. రైతులకు ఇవ్వరా?

CLP Leader Bhatti Said Farmers Are Suffering Due To Lack Of Loans - Sakshi

రుణాలు పుట్టక రైతుల అవస్థలు: సీఎల్పీ నేత భట్టి   

సాక్షి, హైదరాబాద్‌: బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద రద్దు చేసే పాలకులు, ఆరుగాలం కష్టపడే రైతుకు రుణమాఫీ చేయమంటే మాత్రం వెనకాడుతారెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గురువారం ఇక్కడి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అని నిలదీశారు. తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని హితవు పలికారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రమంత్రి పర్యటన ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి ప్రైవేట్‌ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితిల్లో రైతులు ఉన్నారని, ఈ దుస్థితి వారి ఆత్మహత్యలకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని భట్టి డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ తమిళిసై ఫైర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top