‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ తమిళిసై ఫైర్‌

Tamilisai Says Telangana Govt Discriminating Me For Being Woman - Sakshi

మహిళా గవర్నర్‌ పట్ల ఇంత చులకన భావమా? 

ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్‌ లేదు..

కలెక్టర్లు వచ్చి పలకరించడం లేదు 

‘జాతర’కు హెలికాప్టర్‌ అడిగితే స్పందించలేదు 

అసెంబ్లీలో ప్రసంగించనివ్వడం లేదు..

గణతంత్ర దిన వేడుకలకూ నిరాకరణ 

రాజ్‌భవన్‌ అంటరాని ప్రాంతమా?..

సీఎం, మంత్రులు, ఎంపీలు ఎందుకు రారు? 

రాష్ట్రంలో దయనీయంగా విద్య, వైద్యం, మహిళల భద్రత..  

దయనీయంగా హాస్టళ్లు.. ఫుడ్‌ పాయిజనింగ్‌ నిత్యకృత్యమైందని వ్యాఖ్య 

మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన గవర్నర్‌

‘గవర్నర్‌ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.’ - గవర్నర్‌ తమిళిసై సందరరాజన్‌

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయాన్ని గౌరవించడం లేదు. స్పందించడం లేదు. అన్నీ అవమానాలే. నేనెక్కడికి వెళ్లినా ప్రొటోకాల్‌ అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్‌ వచ్చి పలకరించడం లేదు. తేనీటి విందు (ఎట్‌ హోమ్‌)కు సీఎం రాకపోతే ఆ సమాచారం ఇవ్వడం లేదు. అత్యున్నత పదవిలో ఉండి కూడా ఎన్నో అడ్డంకులు, వివక్షను ఎదుర్కొంటున్నా. ఒక మహిళా గవర్నర్‌ను ఎలా వివక్షకు గురి చేశారన్నది గత మూడేళ్ల రాష్ట్ర చరిత్రలో నమోదైంది..’’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పాలనా విధానాలపై ఆమె ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడూ సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేశారని.. ఇవి తననేమీ చేయలేవని తమిళిసై స్పష్టం చేశారు. గౌరవించక పోయినంత మాత్రాన తక్కువైపోనని.. తాను చాలా శక్తివంతురాలినని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో గవర్నర్‌ చెప్పిన అంశాలు, చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. 

రాజ్‌భవన్‌ అంటరాని ప్రాంతమా? 
‘‘సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్‌ కావాలని అడిగితే చివరిక్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇచ్చేదీ, లేనిదీ కనీసం సమాచారం ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించి జాతరకు వెళ్లాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కోరలేదు. ఎక్కడికైనా కారు, రైలు ద్వారా వెళ్తున్నాను. అయినా అసెంబ్లీలో నా ప్రసంగాన్ని నిరాకరించారు. గణతంత్ర దినోత్సవం నాడు నేను జాతీయ జెండా ఎగురవేయకుండా నిరాకరించారు. ప్రసంగం కాపీ కోరితే ప్రభుత్వం పంపలేదు. నేను నోరు మూసుకు­ని ఉండాలా? సాధారణ పౌరురాలిగానే ఆ రో­జు మాట్లాడాను. గణతంత్ర దినోత్సవానికి  సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? ఇది అంటరాని ప్రాంతమా? వివ­క్ష చూపుతారా? గణతంత్ర వేడుకలను కేవ­లం రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని మం­త్రి­వర్గం ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది? పరేడ్‌ ఎందుకు ఉండకూడదు? అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం పరేడ్‌ నిర్వహించాయి. కోవిడ్‌ మహమ్మారి కేవలం తెలంగాణలోనే ఉందా? రాజకీయ సభలు జరగలేదా? 

హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా.. 
ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టు గవర్నర్‌ ఆమోదించాలని లేదు. నేనేమీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి విషయాన్ని తిరస్కరించడం లేదు. హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నాను. గవర్నర్‌ కోటాలోని సర్వీసు కేటగిరీలోకి రాడనే ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి నియామకాన్ని అంగీకరించలేదు. గవర్నర్‌ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. తాము ఎన్నుకున్నవారు అందుబాటులో లేకపోవడంతోనే ప్రజలు తమ సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు. మహిళా దర్బార్‌కు వచ్చిన అర్జీలు, బాసర ట్రిపుల్‌ ఐటీలో దయనీయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదు. గవర్నర్‌ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు లేవని గుర్తుంచుకోవాలి. 

విద్య, వైద్యం, మహిళా భద్రతే.. 
రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళల భద్రత అతిపెద్ద సమస్యలు. గతంలో నన్ను కలవడానికి సీఎం కేసీఆర్‌ వచ్చేవారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని చాలాసార్లు చెప్పా. కు.ని. శస్త్రచికిత్సలు విఫలమవడం వంటి ఘటనలు చూస్తున్నాం. నిమ్స్‌ డైరెక్టర్‌ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలెవరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. వర్సిటీల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. పిల్లలను పిల్లులు, ఎలుకలు కరుస్తున్నాయి. కేంద్రం కొత్తగా 8 వైద్య కళాశాలలను మంజూరు చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మవడంతో ఎంసీఐ అనుమతి ఇవ్వలేదు.

గవర్నర్‌ పాత్ర అంతకే పరిమితం! 
రుణాలపై ఆంక్షలు, హామీల అమలు విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. ‘‘నేను కేవలం రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నాను. పలు పరిమితులున్నాయి. ప్రతి రాష్ట్రానికి కేంద్ర సహాయం కచ్చితంగా లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవడానికి వేదిక, వ్యవస్థలు ఉన్నాయి. గవర్నర్‌ పాత్ర ప్రేరణ కల్పించడానికే పరిమితం’’ అని తమిళిసై సమాధానమిచ్చారు. 

విమోచన దినమే కరెక్టు..! 
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే తెలంగాణ విమోచన దినం పేరును మార్చిందని. విమోచన దినమే సరైనదని తాను భావిస్తున్నానని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. తెలంగాణ చరిత్రపై తాను అధ్యయనం చేశానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించగా.. ఈ విషయాన్ని పాలనా యంత్రాంగం చూసుకుంటుందని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top