
మౌలిక వసతుల ఆధారంగానే ఫీజులు
కొత్త ఫీజు అమలు వచ్చే ఏడాది నుంచే..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజులపై త్వరలో స్పష్టత రానుంది. ప్రభుత్వం ఫీజుల నిర్ధారణతో జీవో విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. కొన్ని కాలేజీలకు ఫీజులు పెంచి, మరికొన్ని కాలేజీలకు ఫీజులు తగ్గించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీ చేసిన సిఫార్సులను కొలమానంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలో పీఠముడి పడిన విషయం తెలిసిందే. తొలుత ఎఫ్‌ఆర్‌సీ చేసిన ఫీజుల ప్రతిపాదనను ప్రభుత్వం నిలిపివేసింది. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, జాతీయ ర్యాంకుల ఆధారంగా ఫీజులు ఉండాలని భావించింది.
ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని తర్వాత ఎఫ్‌ఆర్‌సీ మరో దఫా కాలేజీలతో సంప్రదింపులు జరిపింది. ఆడిట్ రిపోర్టులను పరిశీలించింది. వీటి ఆధారంగా మూడు కేటగిరీలుగా కాలేజీలను విడగొట్టినట్టు తెలిసింది. ర్యాంకులు, వసతులు, ఫ్యాకల్టీ పరంగా ఉన్న కాలేజీలను మొదటి కేటగిరీలోకి చేర్చారు. వీటికి గతంలో నిర్ధారించిన ఫీజులే అమలుచేసే వీలుంది. ర్యాంకులు లేకున్నా, ఫ్యాకల్టీ, వసతులు ఉన్న కాలేజీలను మరో కేటగిరీలోకి చేర్చారు.
వీటి ఫీజుల పెంపును 15 శాతం మించకుండా చూడాలని భావిస్తున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా లేని కాలేజీలకు ఫీజులు తగ్గించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ క్లాసులు మొదలయ్యాయి. ఈ కారణంగా పెరిగే ఫీజును వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.