
ఎస్సీ విద్యార్థులకు కాలేజీల స్పష్టీకరణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థి ఖాతాలో జమ కావటమే కారణం
ఫీజులన్నీ ముందుగానే వసూలు చేస్తున్న కాలేజీలు
ప్రైవేటుతోపాటు ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే తీరు
వాయిదాల పద్ధతికి కూడా ఒప్పకోని యాజమాన్యాలు
ఏక మొత్తంగా చెల్లించకుంటే సీనియర్ విద్యార్థులైనా క్లాస్ బయటే
వేలకు వేల ఫీజులు కట్టలేక విద్యార్థుల అవస్థలు
కే.నవీన్ కుమార్ అనే ఎస్సీ కేటగిరీ విద్యార్థి టీజీఈఏపీసెట్–2025లో ర్యాంకు సాధించి మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించాడు. మూడు రోజుల క్రితం కాలేజీలో రిపోర్టు చేసేందుకు వెళ్లాడు. నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందన్న ధీమాతో వెళ్లిన అతడికి కాలేజీ యాజమాన్యం మాటలతో దిమ్మ తిరిగి పోయింది. ట్యూషన్ ఫీజు, ఇతర నిర్వహణ ఫీజులు కలిపి రూ.1.25 లక్షలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. తనకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందని చెప్పినప్పటికీ..ఆ డబ్బు విద్యార్థి వ్యక్తిగత ఖాతాలోనే జమ చేస్తారని, ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేయడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు. సీటును కాపాడుకొనేందుకు అప్పుచేసి ఎలాగోలా ట్యూషన్ ఫీజు చెల్లించాడు.
మాసాబ్‌ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ – సైఫాబాద్‌లో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతన్న ఎస్సీ విద్యారి్థకి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద అర్హత ఉన్నప్పటికీ.. మూడు సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజు రూ.75వేలు (ఏటా రూ.25 వేల చొప్పున) చెల్లించాలని కాలేజీలో ఆదేశించింది. ఫీజు చెల్లించకపోతే క్లాసులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షల హాల్ టిక్కెట్లు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు విద్యారి్థ.. ఫీజు డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఫీజుల చెల్లింపుల విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మార్పులు వారి నెత్తిన పిడుగుపాటుగా మారాయి. ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించినప్పటికీ.. వారు పూర్తి ఫీజును ముందుగా చెల్లిస్తేనే కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
రెండు, మూడో సంవత్సరం ట్యూషన్ ఫీజులను సైతం విద్యా సంవత్సరం మొదట్లోనే వసూలు చేస్తున్నాయి. లేదంటే తరగతులకు అనుమతించటం లేదు. ప్రైవేటు కాలేజీలతోపాటు ప్రభుత్వ కాలేజీలు కూడా ఇదే కండిషన్లు పెడుతుండటంతో విద్యార్థులు వేలు.. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు.
ఫీజుల కోసం అప్పులపాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. వీరిలో ఎస్సీ విద్యార్థులు 2 లక్షల మంది వరకు ఉంటారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులు 1,22,205 (రెన్యూవల్స్), 77,722 (ఫ్రెషర్స్) దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులు 45 వేల మంది ఉన్నారు. జనరల్ కోర్సుల ఫీజులు రూ.వేలల్లో ఉండగా.. ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సుల ఫీజులు రూ.లక్షలకు చేరాయి.
ఇంత పెద్దమొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర భారంగా మారుతోంది. చదువును కొనసాగించాలంటే తప్పనిసరిగా అప్పులు చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలని వేడుకున్నా.. కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
నిబంధనల మార్పుతో మొదటికే మోసం..
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వాలు మార్పులు తీసుకొచ్చాయి. ఎస్సీ విద్యార్థుల ఫీజులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో చెల్లిస్తున్నాయి. గతంలో కేంద్రం తన వాటా ఫీజు నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి కాలేజీలకు నేరుగా చెల్లించేది. ఈ విధానాన్ని మార్చి ఫీజులో తన వాటాను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఆ మేరకు విద్యార్థి వివరాలను ఈపాస్ ద్వారా లింక్ చేసుకుని నిధులు విడుదల చేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా ఫీజును విద్యార్థి ఖాతాలోనే జమ చేస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను లబి్ధదారులకు నేరుగా అందించేందుకే ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ ఫీజు విద్యార్థి ఖాతాలో జమ కావటానికి కొంత సమయం పడుతుంది. ఫీజు బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత దానిని విద్యార్థి నుంచి కాలేజీలు తీసుకోవాలి. కానీ, అప్పటివరకు ఆగకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజు మొత్తం వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.