ధరణి అక్రమాలపై సీ'ఐ'డీ! | CID on Dharani irregularities in Telangana | Sakshi
Sakshi News home page

ధరణి అక్రమాలపై సీ'ఐ'డీ!

Jul 7 2026 1:59 AM | Updated on Jul 7 2026 1:59 AM

CID on Dharani irregularities in Telangana

ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో 22 వేల అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు

15 రోజుల్లో నివేదిక సమర్పించనున్న ప్రత్యేక అధికారుల కమిటీ  

నివేదిక అనంతరం లోతైన దర్యాప్తు జరిపించే యోచనలో ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా ధరణి పోర్టల్‌ ద్వారా జరిగిన భూముల రిజిస్ట్రేషన్‌ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై లోతైన దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌తో పాటు ప్రత్యేక కమిటీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. ఈ రెండు నివేదికల ఆధారంగా తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సీఐడీ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండగా, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులతో నియమించిన ప్రత్యేక కమిటీ నివేదిక 15 రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది. ఈ రెండు నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం సీఐడీ లేదా సిట్‌ దర్యాప్తునకు ఆదేశించే అవకాశమున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.  

మొత్తం 8 లక్షల లావాదేవీల పరిశీలన
ధరణి పోర్టల్‌ వేదికగా వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఈ అక్రమ లావాదేవీల వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో భూములు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేశారని ఆ పార్టీ నేతలు ఆది నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పైలట్‌ ప్రాతిపదికన సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన భూలావాదేవీలపై ప్రభుత్వం ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపించింది. కేరళకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ కేరళ సెక్యూరిటీ ఆడిట్‌ అండ్‌ అష్యూరెన్స్‌ సెంటర్‌ (కేఎస్‌ఏఏసీ) ఆడిటింగ్‌ జరిపింది. ఈ రెండు జిల్లాలతో పాటు రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన భూలావాదేవీలపైనా ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ నిర్వహించారు. 

2020 అక్టోబర్‌ నుంచి 2024 డిసెంబర్‌ వరకు జరిగిన మొత్తం 8 లక్షల లావాదేవీలను పరిశీలించగా దాదాపు 22 వేల అనుమానాస్పద లావాదేవీలు నమోదైనట్టు గుర్తించారు. కింది స్థాయి అధికారుల నివేదికలు, ఉత్తర ప్రత్యుత్తరాలతో సంబంధం లేకుండా నేరుగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంతో పాటు అంతకంటే ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల లాగిన్‌ల ద్వారా ఈ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని వెల్లడయ్యింది. సీసీఎల్‌ఏలోని కొందరు సిబ్బంది, అధికారుల ప్రమేయంతోనే మెజార్టీ లావాదేవీలు జరిగాయని, కొన్నిసార్లు తెల్లవారుజాము సమయాల్లో కూడా ధరణి పోర్టల్‌లోకి అధికారిక లాగిన్‌ ద్వారా వెళ్లి భూ హక్కులు రికార్డులు మార్చారని తేలింది. ముఖ్యంగా అసైన్డ్‌ భూముల విషయంలో ఎక్కువ అక్రమాలు జరిగాయని, మొత్తం 10 వేలకు పైగా ఎకరాల్లో ఈ లావాదేవీలు జరిగాయని బహిర్గతమయ్యింది. అయితే ఇందుకు ఎవరు బాధ్యులన్నది మాత్రం ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో స్పష్టంగా వెల్లడి కాలేదు.  

బాధ్యుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ 
ఈ క్రమంలో అక్రమ లావాదేవీలకు బాధ్యులెవరన్నది గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. సీసీఎల్‌ఏ, సైబర్‌క్రైమ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల అధికారులతో పాటు కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ ఆయా లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులెవరన్నది తేల్చనుంది. అక్రమ లావాదేవీల బాధ్యులను గుర్తించండంతో పాటు భవిష్యత్తులో భూభారతి పోర్టల్‌లో ఇలాంటి తతంగాలు జరగకుండా ఏం చేయాలన్న దానిపై ఈ ప్రత్యేక కమిటీ నివేదిక ఇవ్వనుంది. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించగా.. ప్రస్తుతం ఈ కమిటీ అన్ని రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలిస్తోంది. ఈ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి ఇచ్చే నివేదికతో పాటు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement