కాసులు కురిపిస్తున్న కోళ్ల వ్యర్థాలు.. చేపలకు ఆహారంగా కోళ్ల పేగులు, తల, చర్మం.

Chicken Waste Like head, Legs Skin Used To Feed To Fish In Peddapalli District - Sakshi

 ప్రతిరోజూ ప్రత్యేక వాహనాల్లో తరలింపు

క్యాట్‌ ఫిష్‌ల పెంపకానికి సరఫరా చేస్తున్న వైనం

కార్పొరేషన్‌ అధికారుల అండతోనే దందా

పట్టించుకోని సంబంధిత ఉన్నతాధికారులు

‘సాక్షి’ పరిశీలనలో విస్తుపోయే నిజాలు

సాక్షి, గోదావరిఖని(కరీంనగర్‌): చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏడాదంతా ఇదే దందా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా పొరుగు జిల్లా మంచిర్యాలలోని చేపల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యానర్స్‌వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.

‘సాక్షి’ చేపట్టిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో మాఫియా దందా బయటపడింది. నమ్మలేని నిజాలు అనేకం వెలుగు చూశాయి. ఈ మాఫియా దందా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫిషరీష్‌ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతినెలా మాఫియా ముట్టజెప్పే కాసులకు కక్కుర్తిపడి ఈ దందాపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 


చికెన్‌ వ్యర్థాలను సేకరిస్తున్న యువకులు 

మాఫియాకు చికెన్‌ మార్కెట్ల అడ్డా...
రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం, ఎఫ్‌సీఐ తదితర ప్రాంతాల్లోని చికెన్‌ మార్కెట్లు మాఫియాకు అడ్డాగా మారుతున్నాయి. పక్క జిల్లాకు సంబంధించిన ముఠా బహిరంగంగా ఈ దందా నిర్వహిస్తోంది. ఈ ముఠాకు బల్దియా అధికారులతోపాటు చికెన్‌ మార్కెట్‌ వ్యాపారులు సహకరిస్తున్నారు. 

చికెన్‌ వ్యర్థాల సేకరణే టార్గెట్‌..
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొందరు ముఠా సభ్యులు ప్రత్యేక వాహనాల్లో చికెన్‌ మార్కెట్లకు చేరుకుంటారు. వాహనంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న భారీ ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో కోళ్ల నుంచి తీసిన పేగులు, తల, కాళ్లు, చర్మం, ఈకలు సేకరిస్తారు. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు నాలుగు టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు. 

పక్కా రూట్‌ మ్యాప్‌ ద్వారా సేకరణ
చికెన్‌ వ్యర్థాలను సేకరించడానికి ఈ మాఫియా పక్కా రూట్‌ మ్యాప్‌ అమలు చేస్తోంది. ముందుగా గోదావరిఖని చికెన్‌మార్కెట్‌కు చేరుకుని హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున వ్యర్థాలను సేకరించిన అనంతరం ఎల్‌బీనగర్, తిలక్‌నగర్, మార్కండేయకాలనీ, ఫైవింక్లయిన్‌ మీదుగా యైటింక్లయిన్‌కాలనీ చేరుకుంటుంది. ఈరూట్‌ మ్యాప్‌లోని అన్ని చికెన్‌సెంటర్ల నుంచి వ్యర్థాలను ముఠా సేకరిస్తుంది.  

మాఫియాకు సహకరిస్తున్న వ్యాపారులు
చికెన్‌ వ్యర్థాలను సేకరించే మాఫియాకు పారిశ్రామిక ప్రాంతంలోని చికెన్‌ సెంటర్ల వ్యాపారులు, అసోసియేషన్‌ నాయకులు సహకరిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. అయితే ఈ మాఫియా క్యాట్‌ఫిష్‌ పెంపకానికి సేకరించడంపై దృష్టి పెట్టడంతో వ్యాపారులు మున్సిపల్‌ సిబ్బందికి వ్యర్థాలను ఇచ్చేందుకు నిరాకరించారు. వ్యర్థాలను తరలించడానికి ఈ మాఫియా బడా వ్యాపారులు, నాయకులు, అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వ్యర్థాల అక్రమమార్గంతో ఆదాయానికి గండి
రామగుండం నగరపాలక సంస్థకు వ్యర్థాలు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా గతంలో నిబంధనలు రూపొందించారు. టన్ను వ్యర్థానికి రూ.వెయ్యి ఆదాయం వస్తుందని అంచనా వేసి వరంగల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు చికెన్‌ వ్యర్థాలను సేకరించే పనిని అప్పగించారు. ఇందుకు సదరు కాంట్రాక్టర్‌ రూ.5వేలు బల్దియాకు ఫీజు రూపంలో చెల్లించారు. ఇలా సేకరించిన వ్యర్థాలను సదరు కాంట్రాక్టర్‌ రంగారెడ్డి జిల్లాలోని ఓ కంపెనీకి తరలిస్తామనేది ఒప్పందం.

ఇలా కార్పొరేషన్‌ పరిధిలో ప్రతిరోజు సుమారు 2 మెట్రిక్‌ టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలు వెలువడుతాయి. ఈలెక్కన బల్దియాకు రోజుకు రూ.2వేల చొప్పున ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సదరు కాంట్రాక్టర్‌కు వ్యర్థాలను మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. పైగా కొందరు అధికారుల అండదండలతో ఈ వ్యర్థాలను కాంట్రాక్టర్‌కు కాకుండా అక్రమ మార్గాల్లో చేపల చెరువులకు తరలించడం వివాదాస్పదంగా మారుతోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top