
పచ్చజెండా ఊపిన కేంద్రం
110 కి.మీ. నిడివి, రూ. 2,837 కోట్ల వ్యయం
ఒకేసారి మూడు, నాలుగు లైన్ల నిర్మాణం.. నాలుగేళ్లలో అందుబాటులోకి
ఎట్టకేలకు ‘హైలీ యుటిలైజ్డ్ నెట్‌వర్క్’కు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు, సికింద్రాబాద్(secunderabad) నుంచి ఏకంగా రోజుకు కనీసం 150 అదనపు రైళ్లు నడిపేందుకు వీలు కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సికింద్రాబాద్ నుంచి కాజీపేట(Kazipet) వరకు ఉన్న రెండు వరుసల రైల్వే మార్గాన్ని నాలుగు లైన్లకు(Four Line Railway Route) విస్తరించబోతోంది. ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే మార్గంతో జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్‌తో ఇది అనుసంధానం కాబోతోంది.
గ్రాండ్ ట్రంక్ రూట్‌లో మూడో లైన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చినందున త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ మార్గాన్ని నాలుగు లైన్ల రూట్‌గా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, దానికి అనుసంధానమయ్యే సికింద్రాబాద్–కాజీపేట మార్గాన్ని నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకేసారి రెండు అదనపు లైన్లను నిర్మించేందుకు రూ.2,837 కోట్లు అవసరమవుతాయని దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన డీపీఆర్‌లో పేర్కొంది. అదనంగా రెండు లైన్లను నిర్మించేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా నిత్యం నడుస్తున్న 200 రైళ్లకు (గూడ్సు సహా)అదనంగా మరో 150 రైళ్లను నడపొచ్చు.

సామర్థ్యానికి మించి రైళ్లు..
దేశంలో అతి కీలక లైన్లు అయిన హైలీ యుటిలైజ్డ్ నెట్‌వర్క్ (హెచ్‌యూఎన్)లలో సికింద్రాబాద్–కాజీపేట మార్గం ఒకటి. ఈ మార్గంలో సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆ సాంద్రత 150 శాతంగా ఉంది. ఇది ప్రమాదకర పరిస్థితిగా భావిస్తారు. సిగ్నలింగ్‌కు సంబంధించి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఈ తరుణంలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం దాదాపు అసాధ్యంగా మారింది. హైదరాబాద్ నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు రోజుకు అదనంగా 40కి పైగా రైళ్లు అవసరమున్నాయి.
ఆయా ప్రాంతాలకు చెందిన వలస కూలీలు రాష్ట్రంలో అధికసంఖ్యలో పనిచేస్తుండటమే దీనికి కారణం, ఇక ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, తదితర ప్రాంతాలకు కూడా అధికంగా రైళ్ల అవసరం ఉంది. తిరుపతి, విజయవాడలకు కూడా మరిన్ని రైళ్లు తిప్పాల్సి ఉంది. వెరసి కనీసం మరో వందకుపైగా రైళ్లు నడపాల్సిన డిమాండ్ ఉన్నా, ట్రాక్ సామర్థ్యం సరిపోక నడపటం లేదు. ఇప్పుడు మూడు, నాలుగు లైన్లు అందుబాటులోకి వస్తే ఆ కొరత తీరిపోతుంది.
ఎంఎంటీఎస్–2కు వెసులుబాటు
ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండో దశ పనులు జరుగుతున్నాయి. నగరం నుంచి ఘట్‌కేసర్‌కు వరకు రెండు మార్గాల్లో కలిపి నాలుగు లైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన మార్గంలో రెండు లైన్లు, అమ్ముగూడ మీదుగా నిర్మించిన బైపాస్ లైన్‌లో రెండు లైన్లు ఉన్నాయి. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో భాగంగా మూడో లైన్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు కాజీపేట వరకు ప్రధాన లైన్‌ను నాలుగు వరుసలకు విస్తరించనున్నందున, ఎంఎంటీఎస్‌కు నాలుగో లైన్ కూడా అందుబాటులోకి వచ్చినట్టవుతుంది.
అటు వాడీ, ఇటు బల్లార్షా, విజయవాడ.. నాలుగు లైన్లతో..
కాజీపేట నుంచి బల్లార్షా, కాజీపేట నుంచి విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇది గ్రాండ్ ట్రంక్ రూట్ అయినందున, ఈ మార్గంలో నాలుగో లైన్ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక సికింద్రాబాద్–వాడీ మధ్య ఒకేసారి మూడో, నాలుగో లైన్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు మొదలవుతాయి. వెరసి ఈ కీలక మార్గాల్లో నాలుగో లైన్ వస్తున్నందున, విరివిగా రైళ్లను పరిగెత్తించే వీలుంది. దానికి సమతూకం చేయాలంటే సికింద్రాబాద్ నుంచి కాజీపేట మధ్య కూడా నాలుగో లైన్ అవసరమవుతుంది. అప్పుడు హైదరాబాద్ మీదుగా అటు బల్లార్షా నుంచి ఢిల్లీ వైపు, విజయవాడ మీదుగా చెన్నై, ఒడిశా, బెంగాల్ వైపు, వాడీ మీదుగా ముంబై వైపు వీలైనన్ని రైళ్లను నడపొచ్చు.
160 కి.మీ. వేగంతో...
పస్తుతం ఉన్న రెండు లైన్ల మీద రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ. మాత్రమే. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన రెండు లైన్లను 160 కి.మీ. వేగ సామర్థ్యంతో నిర్మించనున్నారు. అప్పుడు ఈ మార్గంలో నడిచే వందేభారత్ రైళ్లు తమ గరిష్ట వేగాన్ని (160కి.మీ.) అందుకొని ప్రయాణిస్తాయి. దీంతో మరింత తొందరగా గమ్యం చేరుకుంటాయి.
పచ్చజెండా ఊపేందుకు సిద్ధం
రైళ్ల రద్దీ పెరిగి రూట్ ఇరుకుగా మారిన నేపథ్యంలో సికింద్రాబాద్–కాజీపేట మధ్య మూడో లైన్ నిర్మించాలని దాదాపు పదిహేనేళ్లుగా ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023లో ప్రాజెక్టు మంజూరై సర్వేకు సూచించారు. ఆ సమయంలోనే ఒకేసారి మూడు, నాలుగు లైన్లను నిర్మించాలని కేంద్రం భావించి ఆ సంవత్సరం జూలైలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరు చేసింది. సర్వే పూర్తి చేసి గత ఏప్రిల్‌లో రైల్వే బోర్డుకు డీపీఆర్ సమర్పించారు. దాన్ని పరిశీలించిన కేంద్రం ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్టు తెలిసింది.
త్వరలో అధికారిక ఆదేశాలు వెలువడనున్నాయి. అదనపు రెండు లైన్ల నిర్మాణానికి 124 హెక్టార్ల భూమిని సేకరించాలని నిర్ణయించారు. త్వరలో ఆ మేరకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ రైల్వే లైన్ తెలంగాణలోని మేడ్చల్ – మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ రైలు మార్గంలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జీలు (ఆర్‌ఓబీ), 27 రైల్వే అండర్ బ్రిడీŠుజ్ల (ఆర్‌యూబీ) ఉన్నాయి. ఘట్‌కేసర్, కాజీపేటతో సహా మొత్తం 16 స్టేషన్లు ఈ రూట్‌లో ఉన్నాయి.