తిరిగి తీసుకొచ్చే యోచనలోకేంద్ర ప్రభుత్వం
ఈ–20 ఇంధన వివాదంపై అత్యవసర కసరత్తు
ప్రభుత్వం, చమురు సంస్థల మధ్య చర్చలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న ఈ–20 ఇంధనంపై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాత వాహనాల్లో ఈ ఇంధనం వల్ల మైలేజీ గణనీయంగా తగ్గుతోందని, ఇంజిన్ లోపలి భాగాలు చెడిపోతున్నాయని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దేశంలో ఈ–20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్) మాత్రమే ప్రామాణిక వేరియంట్‌గా అమ్ముడవుతున్న తరుణంలో పాత వాహనదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, చమురు సంస్థల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ–20కి సమాంతరంగా గతంలో అందుబాటులో ఉన్న ఈ–10 పెట్రోల్ తిరిగి మార్కెట్లోకి తీసుకురావాలా అనే అంశంపై ఉన్నత స్థాయిలో ఆలోచనలు జరుగుతున్నాయి.
ఐదేళ్ల ముందే..
భారత్ అసలు గడువు కంటే ఐదేళ్ల ముందే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే మైలురాయిని విజయవంతంగా సాధించింది. ఈ వేగవంతమైన మార్పు పాత వాహనదారులకు ఇబ్బందిగా మారింది. అధిక ఇథనాల్ మిశ్రమాల కోసం తయారు చేయని పాత ఇంజిన్లలో ఇది సమస్యలనుసృష్టిస్తోందని వివిధ వర్గాల నుంచి నిరసనలు వస్తున్నాయి. మైలేజీ పడిపోవడం, ఇంజిన్ విడిభాగాలు దెబ్బతినడం వంటి సమస్యలపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
స్వచ్ఛమైన పెట్రోల్ లేదా ఈ–10 పెట్రోల్ ఎంచుకునే విభిన్న అవకాశాన్ని ఎందుకు ఇవ్వడంలేదని విపక్ష నేతలూ పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్నిప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ–20 వల్ల పాత వాహనాల్లోమైలేజీ తగ్గుదల కేవలం 3–5 శాతం మాత్రమేనని, ఇది చాలా నాణ్యమైన, స్వచ్ఛమైన ఇంధనం కావడం వల్ల దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఆ స్వల్ప మైలేజీ నష్టం కంటే చాలా ఎక్కువ అని ప్రభుత్వంసమర్థిస్తోంది.
వేర్వేరుగా సరఫరా చేయలేం..
బంకుల్లో విభిన్న రకాల ఇంధనాలను అందుబాటులో ఉంచడంఅసాధ్యమని చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఒక లక్షకు పైగా ఉన్న పెట్రోల్ బంకుల్లో వేర్వేరు రకాల ఇంధనాలను సరఫరా చేయడం వల్ల రవాణా వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందని తేల్చి చెప్పింది. నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని, కార్యాచరణ సామర్థ్యం తగ్గుతుందని ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో సైతం ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రిత్వ శాఖ ఇదే సమాధానాన్ని పునరుద్ఘాటించింది. స్వచ్ఛమైన, వేగవంతమైన, తక్కువ కాలుష్య కారక ఇంధనం అందుబాటులో ఉన్నప్పుడు, తక్కువ నాణ్యత గల ప్రత్యామ్నాయాన్ని ఎందుకు ఎంచుకుంటారని కూడా ప్రశ్నించింది.
మేధావులు సైతం..
ఈ–20తో పాటు ఈ–10 ఇంధనాన్ని కూడా తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాశ్ పూజారి సంయుక్తంగా రాసిన ఒక పత్రికా వ్యాసంలో బహిరంగంగా కోరారు. ఈ–10ని పునరుద్ధరించడం వల్ల ప్రజల్లో ఉన్న ఆందోళనలు తగ్గుతాయని, దేశంలో మొత్తం ఇథనాల్ వినియోగం పెరగడానికి బదులుగా తగ్గుతుందని, పాత వాహనాల నవీకరణ కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న వాహన శ్రేణికి రక్షణ లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాసంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి అయినా, ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ఇలా పెట్రోల్ ప్రత్యామ్నాయాల కోసం బహిరంగంగా పిలుపునివ్వడం ఇదే మొదటిసారి.
» 2023 ఏప్రిల్ తర్వాత తయారై రోడ్డెక్కిన పెట్రోల్ వాహనాలు మాత్రమే ఈ–20 ఇంధనానికి పూర్తిగా అనుకూలం. కానీ 2023 కంటే ముందు విక్రయించిన అత్యధిక శాతం వాహనాలు ఈ–10 పెట్రోల్ ఆధారితంగా నడుస్తాయి. ఒక పెట్రోల్ వాహనానికి అనుమతించదగిన కాలపరిమితి 15 ఏళ్లు. ఉదాహరణకు 2022లో తయారైన ఒక కారు ప్రస్తుత నిబంధనల ప్రకారం 2037 వరకు రోడ్లపై తిరిగే అవకాశం ఉంది. భారీ సంఖ్యలో ఉన్న పాత వాహనదారులకు ప్రత్యామ్నాయం చూపించకపోవడం వల్లనే ఈ చర్చలు ప్రారంభమయ్యాయి.
» దేశంలో వినియోగిస్తున్న చమురు ఇంధనాల్లో పెట్రోల్ రెండవ స్థానంలో ఉంది. 2025–26లో దాదాపు 43 మిలియన్ టన్నుల పెట్రోల్ వినియోగం జరిగింది. ఇంతటి భారీ పరిమాణంలో ఇంధన సరఫరా జరుగుతున్న దేశంలో, వినియోగదారుల అసంతృప్తిని, వాహన సంరక్షణను విస్మరించడం సాధ్యం కాదు.
» ప్రస్తుతానికి ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఎలాంటి కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. రవాణా సవాళ్లు, మౌలిక సదుపాయాల విస్తరణ, అదనపునిర్వహణ ఖర్చులు వంటి సాంకేతిక, సాంకేతికేతరఅంశాలన్నింటినీ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది.


