పైలెట్ ప్రాజెక్టును అమలు చేయండి
కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బీమా లేని వాహనాలకు పెట్రోల్ విక్రయాన్ని నిరాకరించేలా ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలన్న తమ ఆదేశాన్ని పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగుతూండటంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆగస్టు నాలుగవ తేదీన ఈ పైలెట్ ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది. ఇదే అంశంపై తాజాగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ బుధవారం విచారించింది.
కేంద్రం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలపై కొన్ని ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. అయితే బెంచ్ మాత్రం ‘‘మీరు దాన్ని అమలు చేయాల్సిందే’’నని స్పష్టం చేసింది. ఢిల్లీలోనే మొదలుపెట్టవచ్చునని సూచించింది. చమురు సంస్థలు డీలర్లతో సమావేశం కావాల్సి ఉంటుందని న్యాయవాది చెబుతూండగా జోక్యం చేసుకున్న బెంచ్.. ‘‘పైలెట్ ప్రాజెక్టు మొదలుపెట్టండి’’అని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాల పాలనకు నిర్దిష్ట సమయావధిని సూచిస్తూ పక్కా ప్రణాళికను సమర్పించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 21వ తేదీన చేపట్టనున్నట్లు ప్రకటించింది.


