CM KCR: వరిపై సీఎం కేసీఆర్‌ నిరసన గళం.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం

Center Response On CM KCr Protest Over Paddy Procurement Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరి కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా యాసంగిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గత ఖరీఫ్‌లో 32 లక్షల మెట్రిక్‌  టన్నుల బియ్యాన్ని కొన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల(25 శాతం పెంపు) బియ్యం కొనుగోలు పెంచే అంశం పరిశీలనలో ఉందని  పేర్కొంది. గత రబీ సీజన్‌లో ఇచ్చిన హామీ మేరకు  మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. 
చదవండి: CM KCR: కేంద్రంపై యుద్ధం ఆగదు.. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు

అయితే బాయిల్డ్‌ రైస్‌ను కొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పంట వైవిధ్యం అవసరమని, దేశంలో వరి పంట సాగు ఎక్కువైందని, ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని కేంద్రం పేర్కొంది. గత రబీ సీజన్‌లో (2021) పండిన పారా బాయిల్డ్ రైస్ 44.7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొంటామని చెప్పినట్లు, అందులో ఇంకా మిగిలి ఉన్న పారా బాయిల్డ్ రైస్ సేకరణ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది.
చదవండి: దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది: సీఎం కేసీఆర్‌

‘ప్రస్తుతం  దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు. ఈ తరహా రైస్‌ను వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకమీదట పారా బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాం. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. దేశవ్యాప్తంగా వరి, గోధుమ పంటల దిగుబడి దేశీయ అవసరాలకు మించి జరుగుతోంది. గోధుమ పండించే చాలా రాష్ట్రాల్లో వరి కూడా సాగు చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం పప్పు దినుసులు, నూనె గింజలకు డిమాండ్ చాలా ఉంది. వాటిని ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ పరిస్థితుల్లోనే పంట మార్పిడి చేసి పప్పు దినుసులు, నూనె గింజల సాగు చేయమని అన్ని రాష్ట్రాలలో రైతులను కోరుతున్నాము.

పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లు పోతే ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి కూడా స్థలం ఉండదు. పంజాబ్ రాష్ట్రంలో వరి పండించినంతగా వినియోగం ఉండదు. అక్కడ 90% సేకరణకు కారణమిదే. తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ప్రజలు వరి వినియోగిస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకిరాని ఇతర వినియోగదారులు కూడా ఉంటారు. ఏ విషయంలోనూ రాష్ట్రాలను కేంద్రం ఒత్తిడి చేయదు. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్చలు జరిపి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది. తదుపరి రబీ సీజన్లో ఎంత కొంటామనేది రాష్ట్రాలో సమావేశం జరిపి, దిగుబడి అంచనాలను చూసి నిర్ణయం తీసుకుంటాం’ అని కేంద్రం స్పష్టం చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top