
ఇలాచీల దొంగ అరెస్టు
హైదరాబాద్: నగలు, నగదు దొంగలించేవారిని చూశాం..మొబైల్స్‌ను తస్కరించిన వారిని చూశాం. ఆఖరికి కేబుళ్లను చోరీ చేసిన వారినీ చూశాం. కానీ ఓ దొంగ విచిత్రంగా ఇలాచీలు (యాలకులు) దొంగిలించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేమిటని పోలీసులు ప్రశి్నస్తే ఇలాచీలు విలువైనవే కదా అంటూ సమాధానమివ్వడం గమనార్హం. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం..
సనత్‌నగర్‌లోని డీమార్ట్ షోరూంలో ఇటీవల 100 గ్రాముల ఇలాచీ ప్యాకెట్లు మాయమవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. ఓ రోజు సీసీ ఫుటేజీని తనిఖీ చేయగా ఓ వ్యక్తి ఇలాచీ ప్యాకెట్లను తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్లి లో దుస్తుల్లో దాచుకుని వెళ్తున్నట్లు వెల్లడైంది. అదే రోజు సాయంత్రం మళ్లీ సదరు వ్యక్తి షోరూంకు వచ్చి ఇలాచీ ప్యాకెట్లు ఉన్న చోటికి వెళ్లి మరో రెండు 100 గ్రాముల ఇలాచీ ప్యాకెట్లను తీసుకుని లో దుస్తుల్లో దాచుకున్నాడు.
అతను తిరిగి వెళ్లిపోతుండగా సిబ్బంది పట్టుకుని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తన పేరు దీపక్ అని, క్యాటరింగ్ పనులు చేస్తుంటానని వెల్లడించారు. ఇలాచీలు ఖరీదు ఎక్కువని చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు పలుమార్లు షోరూంకు వచ్చి 100 గ్రాముల చొప్పున ప్యాక్ చేసి ఉన్న 22 ప్యాకెట్లను తస్కరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడిని దీపక్‌కుమార్‌ను అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.