కేంద్రం ఆదేశించినా టిప్‌ను తొలగించని క్యాబ్ అగ్రిగేటర్లు
రాష్ట్రంలో క్యాబ్ అగ్రిగేటర్ పాలసీ లేకపోవడమే కారణం
క్యాబ్‌లు తమ పరిధి కాదన్నట్టుగా వ్యవహరిస్తున్న రవాణాశాఖ
టిప్ చెల్లించకుంటే క్యాబ్ బుక్ అవడంలో తీవ్ర జాప్యం
తప్పని పరిస్థితిలో టిప్‌ను ఓకే చేస్తున్న ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు యాప్‌లో బలవంతంగా టిప్‌ను ఓకే చేయాల్సిన పరిస్థి తిని క్యాబ్ అగ్రిగేటర్లు కొనసాగిస్తున్నారు. టిప్ చెల్లించ కుంటే క్యాబ్ వెంటనే బుక్ కాకుండా యాప్ అల్గారిథమ్ సాఫ్ట్‌వేర్ అడ్డుకుంటుంది. దీనిపై దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, రైడ్ బుక్ చేసేప్పుడు టిప్‌ను బలవంతంగా అంటగట్టడాన్ని నిషేధించింది. ఓ అగ్రిగేటర్‌కు ఏకంగా రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. కానీ, కేంద్రం హెచ్చరికలను హైదరాబాద్‌లో అగ్రిగేటర్లు పట్టించుకోవటం లేదు.
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను అమలు చేయకపోవటాన్ని రక్షణ కవచంగా మార్చుకున్నాయి. రాష్ట్రంలో క్యాబ్ అగ్రిగేటర్ పాలసీ లేకపోవటంతో, చర్యలు తీసుకోవటానికి కూడా రవా ణాశాఖకు వీలు లేకుండా పోయింది. అసలు క్యాబ్ అగ్రి గేటర్ల మీద అజమాయిషీ లేదన్నట్టుగా, క్యాబ్ అగ్రి గేటర్లు ఎంత దుందుడుకుగా వ్యవహరించినా రవాణా శాఖ కళ్లు మూసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆగస్టు 11 నుంచే ఈ టిప్ సిస్టం మీద నిషేధం అమలవు తున్నా... తెలంగాణ దానికి అతీతంగా మారటం విడ్డూరమే.
యాప్‌లో రైడ్ బుక్ చేయగానే...
ప్రధాన అగ్రిగేటర్ యాప్‌లను ఓపెన్ చేసి వెళ్లాల్సిన గమ్యానికి క్యాబ్ బుక్ చేయగానే అల్గారిథమ్ చార్జీని చూపుతుంది. కేటగిరీ ప్రకారం బుక్ చేసిన తర్వాత వెంటనే క్యాబ్ బుక్ కాదు. దిగువ ‘వేగంగా క్యాబ్ బుక్ కావాలంటే టిప్‌ను ఓకే చేయండి’ అని కనిపిస్తుంది. దాని కింద రూ.20, రూ.40, రూ.60 ... ఇలా వివిధ టిప్ మొత్తాలు దర్శనమిస్తాయి. వాటిల్లో ఓ దాన్ని క్లిక్ చేస్తే క్యాబ్ తొందరగా బుక్ అవుతుంది. లేకుంటే, సమయం గడుస్తూనే ఉంటుంది. దీంతో ప్రయాణికులు బలంతంగా టిప్‌ను ఓకే చేయాల్సిన పరిస్థితి వస్తోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం స్పందిస్తూ గత ఆగస్టులో కఠిన చర్యలకు దిగింది. ఓ అగ్రిగేటర్‌కు రూ.10 లక్షల జరిమానా కూడా వడ్డించింది. ఇదే పద్ధతి కొనసాగితే బ్లాక్ లిస్టులో పెట్టడం, లైసెన్సు రద్దు లాంటి చర్యలు కూడా తప్పవని హెచ్చరించింది. దీంతో చాలా రాష్ట్రాల్లో అగ్రిగేటర్లు యాప్‌లో మార్పులు చేశారు.
రాష్ట్రంలో అత్యంత ఉదాసీనం
తెలంగాణలో కేంద్ర నిబంధనల అమలు లేకపో వటాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ పాత పద్ధతిని కొనసాగిస్తున్నారు. ప్రయాణికులు రవాణాశాఖకు ఫిర్యాదు చేస్తే క్యాబ్‌లు తమ పరిధిలోకి రావన్న సమాధానం వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఆటోలు రవాణా శాఖ పరిధిలో ఉన్నాయి. అవి నిబంధలు ఉల్లంఘిస్తే రవాణాశాఖ చర్యలు తీసుకుంటోంది. కానీ ఇప్పటివరకు క్యాబ్ అగ్రిగేటర్ పాలసీని రూపొందించలేదు. దీంతో ఏ నిబంధనల కింద చర్యలు తీసుకోవాలో స్పష్టత లేదు. ఫలితంగా రవాణా శాఖ చేతులెత్తేసింది. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ఇది ప్రయాణికులకు శాపంగా మారింది.


