
రాజేంద్రనగర్: వాటర్ ఫాల్స్ చూసేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థి ప్రమాదవశాత్తు కాలు జారిపడి నీటిలో మునిగి గల్లంతైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన అక్షిత్‌రెడ్డి(24) బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితులైన రోహిత్, పవన్, అనీల్‌లతో కలిసి బైక్‌లపై ఉప్పర్‌పల్లి మొండితత్వ ప్రాంతానికి చెరుకున్నారు. అంతకుముందు వారు గూగుల్‌లో నగరానికి సమీపంలోని వాటర్ ఫాల్స్ కోసం సెర్చ్ చేయగా ఈ ప్రాంతాన్ని చూపించింది. అన్నింటికంటే దగ్గరగా ఉండటంతో నలుగురూ ఆదివారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. ఫొటోలు దిగుతూ రీల్స్ చేస్తూ సందడి చేశారు. అనంతరం అక్షిత్ రెడ్డి వాటర్ ఫాల్స్ మీదుగా ముందుకు నడుస్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. మిత్రులు అతడిని కాపాడేందుకు ప్రయతి్నంచినా అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో వారు 100కు డయల్ చేసి సమాచారం అందించడంతో రాజేంద్రనగర్ పోలీసులు డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న డీఆర్‌ఎఫ్ బృందం సాయంత్రం వరకు గాలించినా అతని జాడ తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే ఇదే జలపాతంలో నలుగురు నీట మునిగి మృతి చెందడంతో కంచె ఏర్పాటు చేశారు. అయినా కంచెను తొలగించి నీటిలో ఈదడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే అక్షిత్ రెడ్డి మృతి చెందాడు.