
ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో విస్తారంగా వర్షాలు
భారీగా వరదనీరు చేరికతో కనువిందు
సందర్శకుల మదిని దోచేస్తున్న ప్రకృతి అందాలు
చుట్టూ పచ్చని కొండలు.. గిరులపై నుంచి జాలువారే జలపాతాల అందం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తూ కనువిందు చేస్తుండటంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వీటిని తిలకించేందుకు ఉత్సాహంగా తరలివస్తున్న సందర్శకులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు ఉరకలేస్తున్నాయి. డుడుమ జలపాతం 558 అడుగుల పైనుంచి మంచుతెరల మధ్య జాలు వారుతూ పర్యాటకులను కట్టిపడేస్తోంది. అల్లూరి జిల్లా మంచంగిపుట్టు మండలంలోని కుమడ పంచాయతీలో జడిగూడ జలపాతం కనువిందు చేస్తోంది. ముంచంగిపుట్టు– పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం ఎత్తయిన గిరులపై నుంచి జాలువారుతూ పాలనురగను తలపిస్తోంది. బరడ పంచాయతీ పరిధిలో హంశబంద, జర్జుల పంచాయితీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
బూసిపుట్టు పంచాయతీ, సంతవీధి, దోనిపుట్టు గ్రామాల దగ్గర నెమలి జలపాతాలు ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి సమీపంలోని రంగినిగూడ జలపాతం ఉరకలు వేస్తూ కనువిందు చేస్తోంది. వీటి అందాలను తిలకించేందుకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.ప్రత్యేక అనుభూతి పొందుతున్నారు.
వసతుల్లేక నరకం
జలపాతాల అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు రహదారి, కాటేజీల సౌకర్యం లేక, తినేందుకు ఆహారం దొరక్క నరకం చూస్తున్నారు.
తారాబు జలపాతానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి బూసిపుట్టు మీదుగా గుంజువాడ చేరుకోవాలి. అక్కడి నుంచి జలపాతం వద్దకు రెండు కిలోమీటర్ల పొడవునా బురదలోంచి వెళ్లాలి. జలపాతం దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు కర్రలు ఏర్పాటుచేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడికి చేరుకుంటున్నారు. బూసిపుట్టు నుంచి పిట్టలబుర్ర వరకు రోడ్డు మంజూరైంది. పనులు మొదలుపెట్టి వదిలేశారు.
జడిగూడ జలపాతానికి ముంచంగిపుట్టు నుంచి కుమడ చేరుకోవాలి. అక్కడ నుంచి భల్లుగుడ మీదుగా కిలోమీటరు మేర కాలినడకన వెళ్లాలి. తుప్పల మయంగా ఉండటంతో సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ స్థానికులు కొంతమేర రహదారి మార్గాన్ని రాళ్లతో మెరుగుపరిచారు.

రంగినిగూడ జలపాతానికి ముంచంగిపుట్టు నుంచి లక్ష్మీపురం మీదుగా రంగినిగూడ వెళ్లాలి. అక్కడి నుంచి అరకిలోమీటరు దూరంలో ఉన్న జలపాతం వద్దకు వెళ్లేందుకు రహదారి లేదు.
నెమలి జలపాతాలకు ముంచంగిపుట్టు నుంచి సరియాపల్లి మీదుగా వెళ్లాలి. అడవిమార్గంలో మూడు కిలోమీటర్ల మేర నడిచి కొండలపై నుంచి వెళ్లాలి.
ఇబ్బందులు తప్పడం లేదు
ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా డుడుమ, తారాబు జలపాతాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమా షూటింగ్‌ల సంఖ్య గత కొద్ది నెలలుగా పెరిగాయి. పర్యాటకులు ఉండేందుకు కాటేజీలు, జలపాతాలకు వెళ్లేందుకు రహదారులు లేవు. దీనివల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటిని అందుబాటులోకి తెస్తే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.
– బాయన నాథ్, పర్యాటకుడు, విశాఖపట్నం
కనీస వసతులు కరువు
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో చాలా జలపాతాలు ఉన్నాయి. ప్రతి రోజు వీటిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు. తారాబు,డుడుమ జలపాతాల వద్ద సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. అయితే కనీస వసతులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు సౌకర్యాలు కల్పిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
– గంపరాయి అనిల్, ఫొటోగ్రాఫర్, ముంచంగిపుట్టు
చదవండి: వానాకాలంలోనూ నీటి కోసం విలవిల