
నీటిని ఇలా నిల్వ చేసి ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు
గతేడాది కంటే 36 శాతం పెరిగిన ట్యాంకర్ల బుకింగ్
సగం సైతం నమోదు కాని సాధారణ వర్షపాతం
పాతాళంలోకి పడిపోయిన భూగర్భ జలమట్టం
అత్యవసర ట్యాంకర్ల పేరిట ప్రైవేట్ దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో: మహా హైదరాబాద్‌గా నలు దిక్కులా విస్తరిస్తున్న నగరాన్ని జలఘోష వెంటాడుతోంది. వేసవిలోనే కాదు.. వానా కాలంలో సైతం నిత్యావసరాలకు వినియోగించే నీటి కోసం విలవిలలాడే దుస్థితి నెలకొంది. అడుగడుగునా కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో భూమిలో వర్షపు నీరు ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. విచ్చలవిడిగా వందల మీటర్ల లోతుతో బోర్ల తవ్వకాలు నీటి మట్టాన్ని పాతాళంలోకి నెట్టేశాయి. తాజాగా తక్కువ వర్షాలతో భూగర్భజలాలు పైకి రాని పరిస్థితి నెలకొనడంతో ట్యాంకర్లపై ఆధారపడక తప్పడం లేదు. బహుళ అంతస్తు భవన సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కంపెనీల నుంచి ట్యాంకర్లకు తాకిడి పెరిగింది. జలమండలి శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు శుద్ధి చేయని నీటిని సరఫరా చర్మ వ్యాధులకు గురి చేస్తోంది.
బావురుమంటున్న బోర్లు..
బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో బోరుబావులు బావురుమంటున్నాయి. నగరంలో సుమారు 3.29 లక్షల వరకు చిన్నా.. పెద్దా అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలుండగా ఇందులో సుమారు 72 వేల సముదాయాల్లో నీటి ఎద్దడి నెలకొంది. కేవలం నిత్యావసర నీటికి డిమాండ్ పెరగడంతో వేసవి మాదిరిగానే రోడ్లపై ట్యాంకర్ల పరుగులు కనిపస్తున్నాయి. ఓఆర్‌ఆర్ పరిధిలో వేలాది సముదాయలకు వాటర్ బోర్డు నల్లా కనెక్షన్లు లేవు. బోరు బావుల్లో నీటి మట్టం పెరగకపోవడంతో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
36 శాతం పెరిగిన బుకింగ్
జలమండలికి ఈ నెలలో ట్యాంకర్ తాకిడి బాగా పెరిగింది. గతేడాది జూలై మొదటి రెండు వారాలతో పోల్చితే 36 శాతం బుకింగ్ పెరిగినట్లు కనిపిస్తోంది. మొత్తం 22 డివిజన్ పరిధిలో గతేడాది 63,724 ట్యాంకర్లు బుకింగ్ జరిగితే ఈసారి 86,520 ట్యాంకర్లు బుకింగ్ అయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శివారు ప్రాంతల్లో 23 నుంచి 51 శాతం పెరగగా, ఎల్‌బీనగర్ పరిధిలో మాత్రం ఐదింతల ట్యాంకర్ల తాకిడి పెరిగింది. నారాయణగూడ డివిజన్‌లో 51 శాతం, పాత బస్తీలోని చార్మినార్, రియాసత్ నగర్ డివిజన్ పరిధిలో గతేడాది కంటే 117 నుంచి 257 శాతం పెరగడాన్ని బట్టి భూగర్భ జలాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రోజువారీగా 5 వేల నుంచి 6 వేల ట్యాంకర్లు బుకింగ్ జరుగుతోంది. మొత్తమ్మీద దాదాపు 14.06 లక్షలకు పైగా కనెక్షన్లు ఉండగా.. అందులో కేవలం 42 వేల గృహ సముదాయాల నుంచి మాత్రమే వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఉంటుందని జలమండలి పేర్కొంటోంది. సుమారు 500 గృహ సముదాయాలు వేసవిలో 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు బుక్ చేయగా, మిగిలిన 41,500 వేల సముదాయాలు 90 శాతం అంటే.. 2.84 లక్షల ట్యాంకర్లను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ ట్యాంకర్లకు కాసుల పంట
ప్రజల నీటి అత్యవసరం ప్రైవేట్ జల వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. వాటర్‌బోర్డు ట్యాంకర్ల ధర తక్కువగా ఉన్నప్పటికీ.. సరఫరాలో కొద్ది జాప్యం ప్రైవేట్ ఆపరేటర్లకు కలిసి వస్తోంది. ఖాళీ ప్లాట్లతో పాటు చెరువుల సమీప స్థలాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేసి పగలు, రాత్రి అనే తేడా లేకుండా దందా కొనసాగిస్తున్నారు. నీరు నిత్యావసరం కావడం.. ట్యాంకర్ దొరికితే చాలన్న గత్యంతరం లేని పరిస్థితుల్లో.. ఎంత ధరయినా పెట్టి ట్యాంకర్లు తెప్పించుకోవడం సర్వసాధారణమైంది. వాటర్‌బోర్డు కస్టమర్ అకౌంట్ నంబర్ (సీఏఎన్) ద్వారా 5000 లీటర్ల వాటర్ ట్యాంకర్‌ను బుక్ చేసిన వారికి రూ.500కు లభిస్తోంది. సీఏఎన్ లేనివారికి అదే ట్యాంకర్‌ను రూ.850కు సరఫరా చేస్తోంది. అదే ట్యాంకర్‌ను ప్రైవేటులో తెప్పించుకోవాలంటే ప్రాంతాన్ని బట్టి, అత్యవసరాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వర్షాభావ పరిస్థితులతో..
ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ.. సాధారణ వర్షపాతం సగటున సగం కూడా నమోదు కాకపోవడంతో భూగర్భజలాల పెరుగుదల లేకుండా పోయింది. గత నెలలో సాధారణ వర్షపాతం 40 శాతం మించకపోగా, ఈ నెలలో సైతం అదే పరిస్థితి పునరావృతమతోంది. వేసవి కంటే ముందు అడుగంటిన నీటి మట్టంలో వృద్ధి కనిపించడం లేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 8.3 సెంటీ మీటర్లకు మించలేదు.
రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా.. నగర శివారులోని ఎనిమిది అర్బన్ మండలాల్లో 30 నుంచి 40 శాతం కూడా నమోదు కాలేదు. మేుడ్చల్– మల్కాజిగిరి జిల్లా సాధారణ వర్షపాతం (Rainfall) 56 శాతం తక్కువగా నమోదైంది. వేసవిలో సుమారు 10 నుంచి 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు చేరాయి. తాజా వర్షాభావ పరిస్థితులతో పలు ప్రాంతాల్లో తక్కువ లోతులో ఉన్న బోర్ల నుంచి సైతం నీటి చుక్కనీరూ పైకి రావడం లేదు.

ఇంకుడు గుంతలు తప్పనిసరి..
భూగర్భ జలాల పెంపునకు 300 గజాలపైగా ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరి. ఇప్పటికే సర్వే నిర్వహించి ఇంకుడు గుంతలు లేని సుమారు 16 వేల గృహ సముదాయాలకు నోటీసులు జారీ చేశాం. వర్షాకాలంలో 90 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలపై అవగాహన కల్పిస్తున్నాం. జలయజ్ఞంలో అందరి భాగస్వామ్యం అవసరం.
– అశోక్ రెడ్డి, ఎండీ, జలమండలి
చదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ క్రేజ్.. త్వరపడండి