
పరవళ్లు తొక్కుతున్న బొగత...
పర్యాటకుల సందర్శన నిలిపివేత
కనువిందు చేస్తున్న భీమునిపాద జలపాతం
చూడచక్కని రాయికల్ జలపాతం
సాక్షి, నెట్‌వర్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం జాలువారుతోంది. పాల నురుగలు కక్కుతూ ఎగిసి పడుతున్న తుంపరులతో కనువిందు చేస్తోంది. కాగా, బొగత జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో తాత్కాలికంగా పర్యాటకుల సందర్శనను నిలిపివేసినట్టు ములుగు డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప దట్టమైన అడవిలోని భీమునిపాద జలపాతం జాలువారుతూ చూపరులను కనువిందు చేస్తోంది. బయ్యారం పెద్దగుట్టపై ఉన్న పాండవుల జలపాతం, చింతోనిగుంపు సమీపంలోని వంకమడుగు జలపాతం అందాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు.
ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతోంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి ఈ జలపాతం పారుతోంది.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మందగూడ పంచాయతీ పరిధిలోని చింతలమాదర(తిర్యాణి) జలపాతం జలకళను సంతరించుకుంది. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న నీళ్లు పాలధారను తలపిస్తున్నాయి.