
బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిపై తిరుపతి జిల్లాలో దాష్టీకం
కులం పేరుతో దూషించొద్దని అన్నందుకు రాడ్లతో దాడి..
చేతులు, కాళ్లు కట్టేసి ఒకటిన్నర రోజుల పాటు చిత్రహింసలు
ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసుల నిరాకరణ
వారిపై కేసు కట్టలేమని నిస్సిగ్గుగా స్పష్టికరణ
అలాగైతే ఆత్మహత్య చేసుకుంటానన్న బాధితుడు
కొంత మంది పేర్లు తొలగించి పోలీసులు రాసిన ఫిర్యాదుపై సంతకం పెట్టించుకుని పంపిన వైనం
సాక్షి, టాస్క్ ఫోర్స్: దళితుడిగా పుట్టడమే ఓ బీటెక్ విద్యార్థికి శాపంగా పరిణమించింది. సీనియర్ అన్న గౌరవం కూడా లేకుండా తరచూ కులం పేరుతో దూషిస్తున్న జూనియర్‌కు అది తగదని చెప్పడమే పాపమై పోయింది. ఆ జూనియర్ రౌడీషీటర్లతో కలిసి దళిత విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కారులో కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. కత్తులతో తలపై కోశారు. అరవకుండా నోట్లో డ్రాయర్ (అండర్ వేర్) కుక్కారు. హాకీ స్టిక్‌లు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మూత్రం తాగించారు. ఇంత తీవ్ర అవమానంతో న్యాయం కోసం వెళ్తే పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి మిన్నకుండిపోయారు.
ఈ అమానవీయ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఓ కళాశాలలో జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని తన జూనియర్ యశ్వంత్ నాయుడు తరచూ కులం పేరుతో దూషిస్తూ, జేమ్స్‌ను తీవ్రంగా అవమానిస్తున్నాడు. ఇటీవల యశ్వంత్ మరోసారి తీవ్రంగా అవమానించడంతో అలా మాట్లాడటం తగదని జేమ్స్ బదులిచ్చాడు. దీంతో అతనిపై యశ్వంత్ నాయుడు కక్ష పెంచుకున్నాడు.
‘మంగళవారం’ మంగళం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న తన బావను కలిసేందుకు జేమ్స్ వెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న యశ్వంత్ నాయుడు.. రౌడీషిటర్ రూపేష్, మరో రౌడీషిటర్ చోటా బ్లేడ్, కిరణ్, జగ్గ, నానిలతో కారులో అక్కడికి వెళ్లాడు. జేమ్స్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకొని బూతులు తిడుతూ.. కులం పేరుతో దూషించాడు. ఆపై కారులో అందరూ పిడిగుద్దులు గుద్దుతూ హాకీ స్టిక్స్, రాడ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కత్తితో తలపై గాయ పరిచారు. మూత్రం పోసి తాగించారు. బాధితుడు అరవకుండా నోట్లో డ్రాయర్ కుక్కారు.
లాడ్జిలో బంధించి మరోమారు దాడి
జేమ్స్‌ను తిరుచానూరు సమీపంలోని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి ఓ గదిలో బంధించారు. ఒకటిన్నర రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. హోటల్ యజమానితో పాటు అందరూ మరోమారు దాడి చేశారు. ముఖంపై మూత్రం పోశారు. కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తుండగా కొంత మంది అక్కడికి రావడంతో వారంతా అక్కడ నుంచి వెళ్లిపోయారు. జేమ్స్ అపస్మారక స్థితిలో ఉండగా.. అక్కడికి వచి్చన వారు (ఎవరో తెలియదు) కట్లు విప్పి ఆస్పత్రికి తరలించారు. కొంచెం కోలుకున్న తర్వాత తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగిన విషయం పోలీసులకు వివరించాడు.
ఆ మేరకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు స్వీకరించ లేదు. వారిపై కేసు కట్టేంత ధైర్యం తమకు లేదని నిస్సిగ్గుగా స్పష్టం చేశారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉండి బతిమాలినా పట్టించుకోలేదు. మరుసటి రోజు పోలీసుస్టేషన్‌కు వెళితే ఫిర్యాదులో కొంత మంది పేర్లు తొలగించి మరో ఫిర్యాదు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జేమ్స్ చెప్పడంతో పోలీసు సిబ్బందే తూతూ మంత్రంగా ఫిర్యాదు రాసి బాధితుడి వద్ద సంతకం తీసుకున్నారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే తీవ్రంగా బెదిరించారని బాధితుడు వాపోయాడు. కాగా, జేమ్స్ కుడి కన్నుకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితులకు అధికార టీడీపీ అండ ఉండటంతో కేసు తీసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నట్లు సమాచారం.