తేలు కాటుకు బీటెక్‌ విద్యార్థిని మృతి

BTech Student Dies of Scorpion Bite - Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లా: తేలు కాటుకు గురైన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి రగుడు గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తుల వివరాల పకారం.. రగుడుకు చెందిన దొంతుల బాలమల్లు–పద్మ దంపుతలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కూతురు మాలతి(22) బీటెక్‌ పూర్తి చేసింది. ఇటీవలే ఆమె ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం రాగా, జాయిన్‌ కావాల్సి ఉంది.

ఆదివారం తల్లిదండ్రులతో కలిసి తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. కూరగాయలు తెంపుతున్న సమయంలో కాలికి ఏదో విషపురుగు కుట్టినట్లు అనిపించగా అక్కడున్నవారికి తేలు కనిపించింది. మాలతిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె హార్ట్‌బీట్‌ తక్కువగా ఉందని, మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు చికిత్స పొందిన ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం చనిపోయింది. ఉద్యోగం చేసి, తమకు అండగా ఉంటుందనుకున్న కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

బీజేపీ నాయకుల ఆందోళన
సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో సరైన చికిత్స అంది ఉంటే మాలతి బతికేదని బీజేపీ నాయకులు అన్నా రు. ఈ మేరకు దవాఖానాలో వారు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మురళీధర్‌ వారి తో మాట్లాడారు. యువతి గుండె పనితీరు సరిగా లేకపోవడం వల్లే మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారన్నా రు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top