స్నేహమంటే ఇదేరా.. ఫ్రెండ్స్‌ అనిపించుకున్నారు..

Btech Classmates Helps Warangal Man Family - Sakshi

మిత్రుడి కుటుంబానికి రూ.10 లక్షల సాయం 

ఖానాపురం: ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగం సంపాదించాడు. ఏ లోటు లేకుండా కుటుంబాన్ని పోషించుకున్నాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలోనే విధి ఆ కుటుంబాన్ని కోలుకోకుండా చేసింది. ఆ దంపతులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. అయితే, కొంతమంది స్నేహితులు ఆ కుటుంబానికి సాయం అందించి.. స్నేహితుల దినోత్సవం రోజున స్నేహమంటే ఇదేరా అని నిరూపించారు.  

వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బోడ పూల్‌సింగ్‌.. హైదరాబాద్‌లో 2002లో బీటెక్‌ పూర్తి చేశాడు. ఉపాధిహామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు అభినాష్, చరణ్‌ ఉన్నారు. 2018లో భార్య మంజుల అనారోగ్యంతో మృతిచెందింది. 2019లో పూల్‌సింగ్‌ గుండెపోటుతో మృతి చెందాడు. పిల్లలను పూల్‌సింగ్‌ తమ్ముడు చేరదీసి చదివిస్తున్నాడు. పూల్‌సింగ్‌ పిల్లలకు సాయం చేయాలని ఆయన బీటెక్‌ క్లాస్‌మేట్స్‌ నిర్ణయించుకున్నారు.

దేశ విదేశాల్లో ఉన్న 60 మంది మిత్రుల సహకారంతో రూ.10 లక్షలు సమకూర్చారు. ఆదివారం పూల్‌సింగ్‌ పిల్లలు అభినాష్, చరణ్‌లకు ఓడీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు చేతుల మీదుగా రూ.10 లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో స్నేహితులు దామోదర్‌రెడ్డి, శరత్‌బాబు, సుస్మిత, రఘు, శేఖర్, శ్రీకాంత్, కిరణ్, మేర్వాల్, అనిల్, అయ్యప్ప, హైమవతి, సూర్య తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top