Both TRS MLAs Not Coming To Their Constituencies After Farmhouse Episode - Sakshi
Sakshi News home page

ఫాంహౌజ్‌ ఎపిసోడ్‌ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?

Nov 29 2022 12:20 PM | Updated on Nov 29 2022 2:52 PM

Both TRS MLAs not coming to their constituencies after Farmhouse Episode - Sakshi

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గం జనాలకు ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారట. అందుకే తమ పీఏలు, అనుచరులతో పనులు చక్కబెడుతున్నారని టాక్‌. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ఫాంహౌజ్‌కే పరిమితం.?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో గులాబీ పార్టీకే 13 దక్కాయి. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన భీరం హర్షవర్థన్‌రెడ్డి కూడా తర్వాతి కాలంలో కారెక్కి హాయిగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హర్షవర్థన్‌రెడ్డితో పాటు.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చిక్కుకున్నారు.  ఇప్పుడు వీరిద్దరు ఆ ఫాంహౌస్‌ ఎపిసోడ్ తర్వాతి నుంచి తమ నియోజకవర్గాలకు రావటం లేదు. దీంతో వారు ప్రజలకు ముఖం చాటేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.

జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఈ ఇద్దరు మాత్రమే ఎందుకు ఆ వ్యవహారంలో తలదూర్చారనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతుంటే వారిద్దరు మాత్రమే ప్రగతిభవన్‌ను వదలటం లేదు. తమకు  బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఇంటెలిజెన్స్‌ సూచన మేరకే నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని ఎమ్మెల్యేలు చెబుతుండటం విశేషం. ప్రభుత్వం కూడా వీరికి భద్రత పెంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు సమకూర్చింది. ఆయినా వారు నియోజకవర్గాల్లోకి రావడానికి భయపడుతున్నారు.

గోడకెక్కిన గువ్వల
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు అతికించటం కలకలం రేపుతుంది. గతంలో ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లలో ఫోటోలు కూడా పెట్టారు. జిల్లా పరిషత్‌ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డిపై దాడి.. వికలాంగుడిపై దాడి.. గిరిజన సర్పంచ్‌పై దాడి.. ఫారెస్టు ఆఫీసర్‌పై దాడి.. సీఎం పర్యటనలో నన్నే ఆపుతావారా అంటు సీఐపై చిందులు వేశారంటూ పోస్టర్లలో ప్రచురించారు. వీటిని స్దానికులు ఆశ్చర్యంగా చూస్తుండటం ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే పోస్టర్ల వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

చదవండి: (హీటెక్కిన తెలంగాణ పొలిటికల్‌ సమీకరణాలు.. బీజేపీకి లాభమెంత?)

తమ నేతను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. గతంలో కూడ పలు సందర్భాల్లో గువ్వల బాలరాజు తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత ఎమ్మెల్యేపై తిట్లపురాణంతో సాగుతున్న ఫోన్ సంభాషణలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని వందకోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యేను తరమికొట్టాలని.. అందుకు అన్నివర్గాల వారు సహకరించాలని..ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేకు సంకటంగా మారుతున్నాయి.

క్షేత్ర స్థాయి కష్టాలు
కొల్లాపూర్‌ ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్‌రెడ్డి ఇప్పటికే పార్టీ మారి ఆనేక విమర్శలు ఎదుర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారిన నాయకుడు డబ్బు కోసం ఇప్పుడు కూడా మారడని గ్యారెంటీ ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో సఖ్యత లేని కారణంగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ రెండుగా చీలిపోయింది.

దిద్దుబాటు చర్యలకు అధిష్టానం పెద్దగా చొరవ చూపకపోవటంతోపాటు.. ఫామ్ హౌజ్ వ్యవహారంతో పార్టీకి నష్టం కలుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే కొల్లాపూర్‌కు రావాలని ప్రయత్నించినా స్దానికంగా ఉండే తన అనుచరుల సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడ ప్రతిపక్షాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అదునుగా ఎమ్మెల్యే వైరివర్గం నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని మరింత తీవ్రం చేసింది.

ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లో తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపధ్యంలో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల బాటపడతారో లేక ఫాంహౌస్ కేసు తెగేంతవరకు దూరంగా ఉంటారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement