రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్‌ట్రానిక్‌’ విస్తరణ | Sakshi
Sakshi News home page

రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్‌ట్రానిక్‌’ విస్తరణ

Published Fri, May 19 2023 3:39 AM

A boost to the healthcare technology sector in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య పరికరాల ఉత్పత్తి, ఆరోగ్య రక్షణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ట్రానిక్‌ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ) కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మెడ్‌ట్రానిక్‌కు అమెరికా అవతల ఇది అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కానుంది.

ఆరోగ్య రక్షణ సాంకేతిక పరిశోధన, ఆవిష్కరణల రంగంలో తెలంగాణను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సంస్థ నిర్ణయం ఊతమివ్వనుంది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో మెడ్‌ట్రానిక్‌ ప్రతినిధుల బృందం గురువారం భేటీ అయింది. ప్రస్తుత పెట్టుబడితో వచ్చే ఐదేళ్లలో 1,500కు పైగా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.  

హైదరాబాద్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనం 
వైద్య పరికరాల ఉత్పత్తికి భారతదేశంలో అపారమై­న మార్కెట్‌ ఉందని గుర్తించిన తొలి రాష్ట్రం తెలంగా­­ణ అని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తాము ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని, లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌ కేర్‌ రంగంలో హైదరాబాద్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు మెడ్‌ట్రానిక్‌ పెట్టుబడి నిదర్శనమని అన్నారు.

హెల్త్‌కేర్, లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకున్న చర్యలను కేటీఆర్‌ వివరించా­రు. రాష్ట్రంలో హెల్త్‌కేర్‌ టెక్నాలజీ రంగం వృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు మెడ్‌ట్రానిక్‌ విస్తర­ణ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.  

ఆవిష్కరణలకు కొత్త గమ్యస్థానం 
లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌ కేర్‌ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయికి నాయకత్వం వహించేలా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని మెడ్‌ట్రానిక్‌ సర్జికల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్ట్‌ మైక్‌ మరీనా అన్నారు.

మానవ జీవితాలను మార్చే టెక్నాలజీ ఆవిష్కరణలకు భారతదేశం నయా గమ్యస్థానంగా మారిందని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ శక్తి నాగప్పన్, మెడ్‌ట్రానిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దివ్య ప్రకాష్‌ జోషి పాల్గొన్నారు. 

హైదరాబాద్‌లో ‘ఆక్యూజెన్‌ కేంద్రం’ 
అమెరికాలోని పెన్సిల్వేనియా కేంద్రంగా పనిచేస్తున్న బయో టెక్నాలజీ కంపెనీ ‘ఆక్యూజెన్‌’ హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జీన్‌ థెరపీ, రీజనరేటివ్‌ సెల్‌ థెరపీ వ్యాక్సిన్ల తయారీకి సహకారం అందించడం వంటి ముఖ్యమైన కార్యకలాపాలను ఈ కేంద్రం నుంచి నిర్వహిస్తుంది. ఆక్యూజెన్‌ చైర్మన్‌ శంకర్‌ ముసునూరి, చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ అరుణ్‌ ఉపాధ్యాయ తదితరులు గురువారం అమెరికాలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశోధన అభివృద్ధి కేంద్రం ద్వారా తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తామని శంకర్‌ ముసునూరి తెలిపారు. దీని ద్వారా రీజనరేటివ్‌ జెనెటిక్‌ చికిత్సలకు అవసరమైన మందుల తయారీలో తమకు అవకాశం కలుగుతుందని అరుణ్‌ ఉపాధ్యాయ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో అద్భుతమైన బయోటెక్‌ పరిశ్రమలు, ఆ రంగానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నందున దేశీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెద్ద ఎత్తున రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని కేటీఆర్‌ అన్నారు. 2030 నాటికి తెలంగాణ బయోటెక్‌ పరిశ్రమ 250 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement