
బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు.. బాంబు లేదని నిర్ధారణ
జవహర్‌నగర్: ఢిల్లీలోని ఓ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ వద్ద మూడు రోజుల కిందట బాంబు పేలుడు సంభవించిన ఘటనను మరువక ముందే హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలకు వచ్చిన బాంబు బెదిరింపు సందేశం మంగళవారం కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి సీఆర్పీఎఫ్ పాఠశాలకు ఈ–మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశం పంపారు.
జవహర్‌నగర్ సీఆర్పీఎఫ్ పాఠశాలతోపాటు ఢిల్లీలోని రోహిణి, ద్వారకాలోగల సీఆర్పీఎఫ్ పాఠశాలలో బాంబులు అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పాఠశాల ప్రారంభమయ్యాక యాజమాన్యం ఈ–మెయిల్‌ను చూసి అప్రమత్తమైంది. వెంటనే విద్యార్థులను బస్సుల్లో ఇళ్లకు తరలించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించింది.
దీంతో సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ పోలీసులతోపాటు రాచకొండ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఏసీపీ మహేశ్, జవహర్‌నగర్ సీఐ సైదయ్య పాఠశాలకు చేరుకొని పరిసర ప్రాంతాలను, పాఠశాల భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాగిలాలతో, బాంబు స్క్వాడ్‌తో అనువనవూ గాలించి బాంబు లేదని నిర్ధారించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం సతీమణి పేరున కొందరు దుండగులు ఫేక్ ఐడీ సృష్టించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.