బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు | Bomb threat to Begumpet Airport | Sakshi
Sakshi News home page

బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Jun 19 2025 3:50 AM | Updated on Jun 19 2025 3:50 AM

Bomb threat to Begumpet Airport

సనత్‌నగర్‌: బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ కలకలం రేపింది. విమానయానానికి సంబంధించి ఇటీవల వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు కాల్‌ అందరినీ కలవరానికి గురిచేసింది. ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేసేందుకు బాంబులు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్‌ చేసి ఉరుకులు పరుగులు పెట్టించాడు. వెంటనే ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. 

తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. పోలీసు జాగిలాలు, బాంబు ఎక్స్‌ప్లోజివ్‌ నిపుణులు, బాంబు డిటెక్షన్‌ స్క్వాడ్‌ రంగంలోకిదిగి ఎయిర్‌పోర్ట్‌ను అణువణువూ గాలించి తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్‌ పంపిన వ్యక్తి గురించి తెలుసుకునేందుకు సైబర్‌ క్రైమ్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement