
ఈ–కేవైసీ ఉంటేనే రేషన్ !
కొత్త కార్డుదారులకు ప్రభుత్వ సూచన
కరీంనగర్ అర్బన్: నూతనంగా రేషన్ కార్డు పొందినవారంతా తస్మాత్ జాగ్రత్త. ఈ–కేవైసీ ఉంటేనే రేషన్ సరకులు ఇవ్వనున్నారు. తుది గడువంటూ లేకపోగా వీలైనంత త్వరగా సదరు ప్రక్రియ చేసుకోవడమే ఉత్తమం. ఇటీవల రెండు నెలల కాలంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ–కేవైసీ తప్పనిసరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ–పోస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
రెండేళ్లుగా ఈ–కేవైసీ ప్రక్రియ...
రేషన్ కార్డులో ఉన్నవారందరూ ఈ–కేవైసీ నమోదు చేయుంచుకోవాలని రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తిచేసింది. అయితే ఇప్పటికీ అనేకసార్లు గడువు పొడిగించింది. కరీంనగర్ జిల్లాలో 3.01లక్షల రేషన్ కార్డులుండగా 40 వేల మందికిపైగా కొత్తరేషన్ కార్డులు మంజూరయ్యాయి. కార్డులు మంజూరైన వారికి సెప్టెంబరు నెలలో బియ్యం కోటాకూడా విడుదలైంది. వారికి ఈ నెలలో బియ్యం పంపిణీ చేశారు. 32,577 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాతకార్డుల్లో జత చేశారు. పాత కార్డులో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.
ఆధార్ అప్‌డేట్ లేక అవస్థలు..
ఆధార్ నవీకరణ(అప్డేట్) లేకపోవడంతో కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ ప్రక్రియ పూర్తిచేయించుకున్నప్పటికీ ఈ–కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడంలేదు. కారణం తెలుసుకోవాలని బాధితులు ఇతర కేంద్రాలకు వెళ్లి వాకబు చేయగా.. ఆధార్ అప్డేట్ పూర్తి కాకపోవడంతో ఈ–కేవైసీ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
కరీంనగర్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై అధికారులు స్పందించి మరిన్ని ఆధార్ కేంద్రాలను అందుబాటులో ఉంచితే ప్రజలకు ఉపయోగపడుతుందని పలువురు కోరుతున్నారు. కొత్త రేషన్ కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాలని, సదరు ప్రక్రియకు తుది గడువు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు.